ఓ వైపు యువ టీమిండియా వరుస విజయాలతో దుమ్ము రేపుతుంటే.. వారికేమి తీసిపోలేదు మేం అన్నట్లుగా టీమిండియా లెజెండ్స్ జట్టు అద్భుతాలు చేస్తోంది. లెజెండ్స్ జట్టు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్2022 లో భాగంగా సెమీఫైనల్ కి చేరిన విషయం మనందరికి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటంటే? టీమిండియా లెజెండ్స్ ఆటగాడు సురేష్ రైనా పట్టిన క్యాచ్.. ఈ వయసులోనూ రైనాతో మునపటి వేడి ఇంకా తగ్గలేదని ఈ క్యాచ్ పట్టడం ద్వారా మరోసారి నిరూపించాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సురేష్ రైనా.. టీ20 స్పెషలిష్ట్ బ్యాట్స్ మెన్ గా వరల్డ్ క్రికెట్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అందుకు తగ్గట్లు గానే టీమిండియా కు ఎన్నో మరుపురాని విజయాలను కూడా అందించాడు. ఇక IPLలో అయితే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్నే క్రియేట్ చేసుకున్నాడు. ఇక రైనా ఇటు బ్యాటింగ్ తో పాటు అటు ఫీల్డింగ్ లోనూ అద్బుతమైన విన్యాసాలు చేయడం మనం చాలా సార్లే చూశాం. ఫీల్డింగ్ అనగానే మనకు కైఫ్, యువరాజ్, జడేజాలే గుర్తుకు వస్తారు. టీమిండియాలో మళ్లీ అంతటి పేరును ఫీల్డింగ్ లో సంపాదించుకున్నాడు రైనా. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన 2022 ఐపీఎల్ వేలంలో రైనాని ఏ జట్టు కోనుగోలు చేయలేదు. దాంతో తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఇక ఆ తర్వాత రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో ఇండియా లెజెండ్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా లెజెండ్స్ బుధవారం జరిగిన మ్యాచ్ లో తన ఫీల్డింగ్ విన్యాసాన్ని మరో సారి ప్రేక్షకులకు చూపించాడు. అది ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ క్రీజ్ లో బెన్ డక్ 25 బంతుల్లో 46 పరుగులు చేసి చెలరేగుతున్నాడు. ఈ క్రమంలోనే అభిమన్యూ మిథున్ బౌలింగ్ కు వచ్చాడు. మిథున్ ఆఫ్ సైడ్ వేసిన లో ఫుల్ టాస్ బాల్ ను డక్ ఆఫ్ సైడ్ ఆడాడు.. అంతే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సురేష్ రైనా అమాంతం గాల్లో కి ఎగిరి ఆ క్యాచ్ ను పట్టుకున్నాడు. దాంతో బ్యాట్స్ మెన్ తెల్ల మెుహం వేశాడు. వాస్తవానికి అయితే వేరే ఫీల్డర్ ఆ స్థానంలో ఉంటే ఆ క్యాచ్ పట్టే వాడే కాదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.”లేటు వయసులోనూ ఘాటు విన్యాసాలు.. వాట్ ఏ క్యాచ్ రైనాజీ” అంటూ కొందరు రాస్తే.. “ఆ రక్తంలో వేడి ఇంకా తగ్గలేదు రైనా” అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా “జాంటీ రోడ్స్ ఈ క్యాచ్ వీడియో చూస్తే కచ్చితంగా కుళ్లుకుంటాడు” అని సరదాగా స్పందించారు. ఇక వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు చేసిన మ్యాచ్ ను తిరిగి మరుసటి రోజు నిర్వహించనున్నట్లు యాజమాన్యం తెలిపింది.