7 ఓవర్లు వేశాడు.. అన్నీ మెయిడెన్ ఓవర్లే, ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. పైగా 7 వికెట్లు తీసుకున్నాడు. దశాబ్దకాలంగా బౌలింగ్ వేస్తున్నా.. ఇప్పటికీ మిస్టరీ స్పిన్నరే.. బ్యాటర్లకు సింహస్వప్నమే.. అతనే సునీల్ నరైన్. తాజాగా మరో అద్భుతం చేశాడు.
మరికొన్ని రోజుల్లో క్రికెట్ హంగామా ఐపీఎల్ ప్రారంభం కానుంది. రెండున్నర నెలల పాటు క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ వినోదాన్ని అందించే క్రికెట్ పండుగ అది. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులతో పాటు క్రికెటర్లు సైతం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ రిచ్ లీగ్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. ఈ లీగ్‌లో ఇప్పటికే సత్తా చాటి.. ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు లీగ్ ప్రారంభానికి ముందే.. కళ్లు చెదిరే ప్రదర్శనలతో ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో ముఖ్యుడు వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్. ఇతన్ని విండీస్ ప్లేయర్ అనే కంటే.. నైట్ రైడర్స్ ప్లేయర్ అనడం ఉత్తమం. ఎందుకంటే నరైన్.. జాతీయ జట్టుకు ఆడిన మ్యాచ్‌ల కంటే నైట్‌రైడర్స్‌కు ఆడిన మ్యాచ్‌లే ఎక్కువ.
ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు, కరేబియన్ లీగ్‌లో ట్రిబాగో నైట్‌రైడర్స్‌కి, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబి నైడ్‌రైడర్స్‌కి ఆడుతుంటాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా జరిగే లీగ్స్‌లో నైట్‌రైడర్స్‌కు ఆస్థాన ప్లేయర్‌లా మారిపోయాడు. ఇక ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనప్పటి నుంచి నరైన్ కేకేఆర్‌కు తప్ప మరో జట్టుకు ఆడలేదు. ఐపీఎల్ నుంచి రిటైర్ అయినా.. ఆ టీమ్ నుంచే రిటైర్ అయ్యేలా ఉన్నాడు. అయితే.. ఐపీఎల్ 2023 ఆరంభానికి ముందు నరైన్ నమ్మలేని బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. అది కూడా ఇండియాకు వచ్చేందుకు ఫ్లైట్ డిలే అవ్వడంతో ఆడిన టోర్నీలో అద్భుతం చేశాడు.
టీ అండ్ టీ క్రికెట్ బోర్డ్ ప్రీమియర్‌షిప్ డివిజన్ వన్ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. క్వీన్స్ పార్క్ క్రికెట్ క్లబ్-Iకు ప్రాతినిధ్యం వహిస్తున్న సునీల్ నరైన్.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని సెయింట్ క్లెయిర్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో క్లార్క్ రోడ్ యునైటెడ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన నరైన్ ఏకంగా 31 వికెట్లు తీసుకున్నాడు. నరైన్ దెబ్బకు ప్రత్యర్థి జట్టును 24 ఓవర్లలో కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. కాగా.. ఈ మ్యాచ్‌లో నరైన్ ఆడాల్సింది కాదు. ఇప్పటికే ఐపీఎల్ 2023 కోసం అతను ఇండియా చేరుకోవాల్సింది. కానీ, ఫ్లైట్ డిలే కావడంతో ఈ మ్యాచ్ ఆడాడు. మరి నరైన్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝐅𝐀𝐍𝐓𝐀𝟕𝐓𝐈𝐂 𝐍𝐀𝐑𝐈𝐍𝐄 🤩
7️⃣ 𝙊𝙑𝙀𝙍𝙎
7️⃣ 𝙈𝘼𝙄𝘿𝙀𝙉
0️⃣ 𝙍𝙐𝙉𝙎
7️⃣ 𝙒𝙄𝘾𝙆𝙀𝙏𝙎Queen’s park witnessed the Mamba King’s magic! ✨ pic.twitter.com/00Jps2oJao
— KolkataKnightRiders (@KKRiders) March 20, 2023