క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పొట్టి ప్రపంచకప్ పోరు మొదలైపోయింది. అర్హత సాధించిన జట్లు వామప్ మ్యాచులు ఆడుతూ తుదిపోరుకు సిద్ధమవుతుండగా, అర్హత సాధించని జట్లు క్వాలిఫయర్ మ్యాచుల్లో తలపడతున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచుల్లో సంచలనాలు కూడా నమోదయ్యాయి. పసికూన జట్లు మాజీ చాంపియన్లు, దిగ్గజ జట్టను మట్టికరిపిస్తున్నాయి. ఆసియా ఛాంపియన్ శ్రీలంక, నమీబియా చేతిలో ఓటమి పాలవ్వగా, రెండు సార్లు టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ వెస్టిండీస్, నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. ఈ నేపథ్యంలో ఫైనల్ చేరేదెవరు..? కప్ గెలిచేదెవరు? అంటూ పలువురు అంచనాలు వేస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా తన ఫెవరేట్ జట్లేంటో వెల్లడించాడు.
16 జట్ల మధ్య మొదైలన ఈ టోర్నీలో, 8 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మరో నాలుగు జట్లు క్వాలిఫయర్ మ్యాచులు ముగిశాక ఏవన్నది తేలనుంది. అంటే మిగిలిన నాలుగు జట్లు తొలి రౌండ్ లోనే ఇంటిదారి పడతాయి. ఇక అసలైన మజాను అందించే సూపర్ -12 మ్యాచులు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు మరోసారి ఫేవరెట్ గా బరిలోకి డుగుతుండగా, భారత్, ఇంగ్లాండ్ జట్లు టైటిల్ వేటలో అందరికంటే ముందున్నాయి. ఈ తరుణంలో ఏయే జట్లు ఫైనల్ చేరుతాయన్న విషయంపై మాజీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. ఈ క్రమంలో మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్.. “ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ వెళ్తాయని” తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
“భారత్ కచ్చితంగా ఫైనల్ చేరుతుంది.. ఇందులో సందేహం లేదు. ఇక ఆస్ట్రేలియా అంటారా! నేను ఇక్కడ ఉన్నందున ఆసీస్ పేరు చెబుతున్నా..” అని సన్నీ చెప్పుకొచ్చాడు. ఈ అంచనాలను ఎస్ఆర్హెచ్ మాజీ కోచ్ టామ్ మూడీ సైతం అంగీకరించాడు. కాగా, భారత జట్టు తన తొలి వామప్ మ్యాచులో ఆసీస్ ను ఓడించి టోర్నీకి ముందు మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. అక్టోబర్ 19న రెండో వార్మప్ మ్యాచులో న్యూజిలాండ్ తో తలపడనుంది. అలాగే.. సూపర్ -12 పోరులో ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థి పాక్ ను ఢీకొట్టనుంది.