కోహ్లీ, డెవిలియర్స్, మ్యాక్స్‌వెల్ లాంటి హేమాహేమీలు ఉన్న ఆర్సీబీని వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ సమస్య ఎప్పటి నుంచో వేధిస్తుంది. ఇప్పుడు ఆ స్థానాన్ని కేఎస్ భరత్ అనే యువ కెరటం భర్తీ చేస్తున్నాడు. రన్ మెషీన్ కోహ్లీ విఫలమైన సందర్భంలోనూ బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. ఒత్తిడి తట్టుకుని కీలకమైన సమయాల్లో భారీ సిక్సులు కొట్టగల సత్తా భరత్ సొంతం. దాంతో పాటు వికెట్ కీపింగ్ అతని అదనపు బలం. ఆర్సీబీలో డెవిలియర్స్ లాంటి దిగ్గజం ఉన్నా కూడా కేఎస్ భరత్ కీపింగ్ చేస్తున్నాడు. శుక్రవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి, చివరి బంతిని సిక్స్ కొట్టి మరీ ఆర్సీబీని గెలిపించాడు. ఇలా స్టన్నింగ్ ప్రదర్శనలతో అదరగొడుతున్న తెలుగు తేజాన్ని తమ గూటికి తెచ్చుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సన్‌రైజర్స్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పాయింట్స్ టేబుల్ లో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ సీజన్ ఎలాగో పోయింది. వచ్చే సీజన్‌లో అయిన తమ రాత మార్చుకోవాలనే దృఢ సంకల్పంతో ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ మెనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2022 సీజన్ కోసం డిసెంబర్‌లో జరగనున్న మెగా వేలంలో కేఎస్ భరత్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు ఫిక్స్ అయినట్లు సమాచారం. అతను తెలుగు వాడు కావడంతో SRHకు ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుందని వారి అంచనా. ఇప్పుటికే వార్నర్ ఆ జట్టును వీడడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో సన్‌రైజర్స్‌కు నూతన వైభవం తెచ్చేలా మెనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే నిజం అయితే కేఎస్ భరత్‌ను ఆరెంజ్ జెర్సీలో చూడొచ్చు. మరీ భరత్ SRHకు ఆడితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.