అసలు ఐపీఎల్ అంటే సదరు క్రికెట్ అభిమానికి పండగ అనే చెప్పాలి. ప్రతిరోజు ఐపీఎల్ మ్యాచ్ అనగానే అంతా టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడం చూస్తాం. ఐపీఎల్ 2022 సీజన్ అయితే మరో రేంజ్ లో సాగుతోంది. ఈ సీజన్ లో అందరూ అనుకున్నట్లుగానే ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. కొత్త ఫ్రాంచైజీల ఎంట్రీతో ఈ సీజన్ ఉత్కంఠగా మారింది. ప్రతి మ్యాచ్ లో నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తోంది. ఇంక ముంబై, చెన్నై పరిస్థితి చూస్తే అంతా షాకవుతున్నారు. రెండు గ్రేట్ టీమ్లు టేబుల్ లాస్ట్ పొజిషన్లో కొనసాగడం అందరినీ బాధిస్తోంది అనే చెప్పాలి. అయితే ప్రతి ఐపీఎల్ సీజన్లో ఇవి ఫిక్సింగ్ అని వచ్చే ఆరోపణలు, విమర్శలు అసలు నిజమేనా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇదీ చదవండి: 15 ఏళ్ళ క్రితం జరిగిన మొదటి IPL మ్యాచ్ మీకు గుర్తుందా?
ఐపీఎల్ రాక ముందు ఒక ప్లేయర్ వెలుగులోకి రావడానికి ఎంతో కాలం పట్టేది. కాలంలో కొట్టుకుపోయిన ఎంతో మంది గ్రేట్ ఆటగాళ్లు ఉండే ఉంటారు. కానీ ఐపీఎల్ మొదలయ్యాక ఆ లెక్క మారింది. రంజీలు, స్థానిక టోర్నమెంట్ల నుంచి వచ్చిన అన్ క్యాప్డ్ ప్లేయర్లు కూడా మ్యాచ్ విన్నర్లుగా మారడం చూశాం. అయితే ఈ లీగ్ పై ఎప్పుడూ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఏ జట్టు గెలవాలో ముందే నిర్ణయిస్తారని చెబుతుంటారు. ఎవరు ఎన్ని పరుగులు చేయాలి, ఎవరు మ్యాచ్ విన్నర్ గా మారాలి అని ముందే చెప్పి దానిపై ఫిక్సింగ్ చేస్తుంటారని విమర్శిస్తుంటారు.
ప్రతి జట్టు, ప్రతి ఆటగాడు తమ టీమ్ విజయం కోసం వందశాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడటం చూస్తున్నాం. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు వారిలో ఉండే కసే.. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లలో చూస్తున్నాం. వికెట్ తీసినప్పుడు ఒక బౌలర్ ముఖంలో సంతోషం. ఫినిషింగ్ షాట్ కొట్టి తమ జట్టును గెలిపించిన సమయంలో ఒక బ్యాట్స్‌మన్ ముఖంలో కనిపించే వెలుగు ఏ ఫిక్సింగ్ మ్యాచ్ లో చూడగలం? ఒక్క పరుగును కాపాడేందుకు ఫీల్డర్ పడే తాపత్రయం. వికెట్ కోసం బౌలర్ పడే తపన ఇలా ప్రతి మ్యాచ్‌లో ఎన్నో భావోద్వేగభరిత దృశ్యాలు మనం చూస్తుంటాం. అసలు నిజంగా మ్యాచ్ ముందే ఫిక్స్ అయితే ఇంతటి జెన్యూన్ ఫీలింగ్స్ ఎందుకు కనిపిస్తాయి? వాళ్లు ఆటగాళ్లు కదా.. నటులు కాదు కదా నవరసాలను పండించడానికి.
ఇదీ చదవండి: IPLలో దినేష్ కార్తీక్ మెరుపులు! టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయమా?
అసలు ఈ సీజన్ నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఐపీఎల్ అనేది ఫిక్సింగ్ అవునో కాదో.. ఒక క్లారిటీ వస్తుంది. ఈ సీజన్లో ఎంతోమంది ఔత్సాహిక ప్లేయర్లు ఉన్నారు. మొదటిసారి కెప్టెన్సీ తీసుకుని ఇప్పటివరకు తన టీమ్ గుజరాత్ టైటాన్స్ ను టేబుల్ టాపర్ గా నిలిపాడు హార్దిక్ పాండ్యా. పంజాబ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని తానేంటో నిరూపించుకునేందుకు.. లక్నో సూపర్ జెయింట్స్ పగ్గాలు అందుకున్నాడు రాహుల్. ఎంతో కృషి చేస్తూ.. ఇప్పుడు లక్నోని టేబుల్ లో రెండో ప్లేస్ కు చేర్చాడు. గత సీజన్ టేబుల్ చివరన నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్.. సమిష్టి కృషితో వరుసగా నాలుగు మ్యాచ్‌లు విజయం సాధించడం చూశాం. ఐపీఎల్ హిస్టరీలోనే ఎక్కువ టైటిల్స్ సాధించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఇప్పుడు ఒక్క విజయం కోసం ఎంత తహతహలాడుతున్నాడో చూస్తూనే ఉన్నాం. కెప్టన్ కూల్ గా పేరు పొంది ఇండియాకి ఎన్నో విజయాలు అందించిన ధోనీ.. ఇప్పుడు సాధారణ ఆటగాడిగా జట్టు విజయం కోసం ఎంత ఆరాటపడుతున్నాడో కనిపిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మ్యాచ్‌లో కనిపించే దృశ్యాలు చూసిన తర్వాత అది ఫిక్సింగ్ అనే అనుమానం ఎందుకు వస్తుంది? ఏదేమైనా ఐపీఎల్ ఫిక్సింగ్ అనేవి ఆరోపణలే తప్ప నిజం అని చెప్పే అవకాశం, ఆస్కారం, సాక్షం ఏవీ లేవు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లు ఫిక్సింగ్ అని వచ్చే ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.