ఆసియా కప్-2022లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచులో కోహ్లీ సెంచరీతో(122) చెలరేగిన సంగతి తెలిసిందే. 61 బంతుల్లో 122 నాటౌట్, 12 ఫోర్లు, 6 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. ఈ తరుణంలో పోయిన ఫామ్ తిరిగి రాబట్టుకోవడమే కాకుండా.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలో కోహ్లీపై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్‌లుగా ఇద్దరం దూకుడుగా ఆడినప్పటికీ.. నైపుణ్యం విషయంలో మాత్రం కోహ్లీ తన కంటే ముందున్నాడని తెలిపాడు.
నెల రోజుల విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన కోహ్లీ, ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచులో అంతర్జాతీయ టీ20ల్లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో రణ్ వీర్ షోలో పాల్గొన్న గంగూలీ, కోహ్లీ గురుంచి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రిటైరయ్యే నాటికి కోహ్లి తనకంటే ఎక్కువ మ్యాచులు అడతాడని జోష్యం చెప్పిన గంగూలీ, కోహ్లీ కెరీర్ లో అవరోధాలను అధిగమించిన తీరు అత్యద్భుతమని కొనియాడాడు.
“(కెప్టెన్సీ) ఒక పోలిక అని నేను అనుకోను.. ఆటగాడిగా నైపుణ్యం పరంగా పోలిక ఉండాలి. అతను నా కంటే నైపుణ్యం గలవాడని నేను భావిస్తున్నాను. మేము వేర్వేరు తరాలలో చాలా క్రికెట్ ఆడాము. నేను నా తరంలో ఆడాను.. అతను అతని తరంలో ఆడటం కొనసాగిస్తున్నాడు. బహుశా నా కంటే ఎక్కువ మ్యాచులు ఆడతాడు కూడాను. ప్రస్తుతానికి నేను అతనికి ఎక్కువ మ్యాచులు ఆడినప్పటికీ.. అతను దానిని అధిగమించగలడు..” అని గంగూలీ తెలిపాడు.
Ganguly said that Virat Kohli is more skillful than him. pic.twitter.com/4EjO7HfRuW
— Dr. Cric Point 🏏 (@drcricpoint) September 10, 2022
ఇక, కోహ్లీ ఫామ్ లో లేనప్పుడు ఏదైనా సలహా ఇచ్చారా అని అడిగిన ప్రశ్నకు గంగూలీ ఇలా బదులిచ్చాడు. “నేను వాటిని పట్టించుకోను.. మీడియా పరిశీలనలో కాలానుగుణంగా పేర్లు మారుతూ ఉంటాయి. నేను అలాంటి వార్తలు చదవనందున.. వాటి గురుంచి నాకు ఏమాత్రం తెలియదు. అందులోనూ.. నేను ఒక హోటల్‌లోకి ప్రవేశించాక.. రిసెప్షన్‌లో చెప్పే మొదట మాట.. ఉదయం పూట వార్తాపత్రికను నా తలుపు కింద పెట్టవద్దు అని. అందుకే అలాంటి విషయాలు గురుంచి నాకు తెలియవు” అని తెలిపాడు.
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మూడు అంకెల మార్కును చేరుకున్నాడు.. కోహ్లీ. అందులోనూ అతను ఊహించని ఫార్మాట్‌లో. ప్రస్తుతానికి 71 అంతర్జాతీయ సెంచరీలతో రికీ పాంటింగ్ సరసన చేరాడు కోహ్లీ. ఈ విషయంలో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అందరికంటే ముందున్నాడు. మొత్తానికి ఈ టోర్నీలో భారత జట్టుకు కలిసొచ్చింది ఏంటి అంటే.. అది కోహ్లీ ఫామ్ లోకి రావడమే. ఈ టోర్నీలో కోహ్లీ.. సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఏదేమైనా.. ఒక దిగ్గజ ఆటగాడు మరో ఆటగాడిని నాకంటే గొప్ప అని సంభోధించడం చాలా అరుదు. ఈ విషయంలో గంగూలీని మెచ్చుకోవలసిందే. గంగూలీపై.. అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.