టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై ఈ మధ్య విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత దాదా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా జట్టు ఎంపికలో జోక్యం చేసుకుంటున్నాడనే ఆరోపణలు దాదాపై వచ్చాయి. వీటిపై స్పందించిన గంగూలీ అవన్ని ఒట్టి పుకార్లని, పనికిమాలిన ఆరోపణలంటూ కొట్టిపారేశాడు. బీసీసీఐ బాస్‌గా తన పనేంటో తనకు బాగా తెలుసని దాదా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సెలక్షన్ కమిటీ మీటింగ్‌లో తన ఫొటో పెట్టి నిబంధనలు అతిక్రమించినట్లు ఇష్టమొచ్చినట్లు వార్తలు రాశారని ఖండించాడు. సెక్రటరీ జై షా, విరాట్ కోహ్లీతో కలిసి ఫొటో దిగినంత మాత్రానా తాను సెలక్షన్ కమిటీ మీటింగ్‌కు హాజరైనట్లు ఎలా చెప్తారు..? అది బయట ఎక్కడో కలిసిన సందర్భంలో తీసిన ఫొటో అని భావించొచ్చు కదా అని ప్రశ్నించాడు. అయినా ఇలాంటి పిచ్చి ఆరోపణలు నాకు అవసరం లేదు. టీమిండియా తరపున 424 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నాకు నిబంధనలు ఏంటనేవి తెలియవా? ‘అని దాదా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరి దాదాపై వచ్చిన ఆరోపణలపై, వాటికి దాదా వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.