టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన అభిమానులకు పండుగలాంటి వార్త చెప్పాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో తాను ఆడబోతున్నట్లు ప్రకటించాడు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ తొలి సీజన్‌లో ఆడిన దాదా.. రెండు సీజన్‌లో కూడా ఆడుతున్నాడు అని వచ్చిన వార్తలను ఇటివల ఖండించాడు. కానీ.. తాజాగా ఒక్క మ్యాచ్ మాత్రం ఆడతానని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు.
ఈ సారి లెజెండ్స్ క్రికెట్ లీగ్ రెండో సీజన్ మన దేశంలో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో భాగంగా ఓ సోషల్ కాజ్ కోసం గంగూలీ ఓ మ్యాచ్ ఆడబోతున్నాడు. దీంతో దాదా అభిమానులు మరోసారి తమ ఆరాధ్య క్రికెటర్ బ్యాట్ పట్టి బరిలోకి దిగి బాదే సిక్సులను చూడబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ కోసం దాదా వర్క్‌అవుట్స్ మొదలు పెట్టాడు. బీసీసీఐ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే దాదా.. ఇప్పుడు మ్యాచ్ కోసం ఫిట్‌నెస్‌పై కొంత దృష్టి పెట్టాడు.
వాటికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. దానికి ‘ఆజాది కా మహత్సోవ్ కోసం లెజెండ్స్ లీగ్‌లో ఒక ఛారిటీ ఫండ్ రైజింగ్ మ్యాచ్ ఆడాలనుకుంటున్నాను. అందుకోసం శిక్షణ తీసుకుంటున్నాను. 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర సంబరాల్లో భాగంగా ఈ ఫండ్ రైజింగ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మహిళా సాధికారతనుద్దేశించి కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను. ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ టీ20 మ్యాచ్‌లో టాప్ లెజెండరీ క్రికెటర్లతో తలపడాలి. ఎలాగైన మంచి క్రికెటింగ్ షాట్లు ఆడాలి.’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
ఇక గంగూలీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 18,575 పరుగులు చేశాడు. అలాగే అన్ని ఫార్మాట్లు కలిపి 195 మ్యాచ్‌ల్లో టీమిండియాకు కెప్టెన్సీ వహించాడు. అందులో 97 మ్యాచ్‌లను గెలిపించాడు. గంగూలీ 1996లో ఇంగ్లాండ్‌పై లార్డ్స్‌లో తన తొలి టెస్టులో సెంచరీ సాధించి తన టెస్టు అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. రెండో టెస్టులో కూడా గంగూలీ సెంచరీ సాధించాడు. మరి ఈ లెజెండరీ క్రికెటర్ మరోసారి గ్రౌండ్‌లోకి దిగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన గంగూలీ ఈ ఆటగాడిని తొక్కేశాడా?