బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సెక్యూరిటీని పెంచనుంది. భద్రత పెంచమని దాదా అడగకున్నా దీదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సెక్యూరిటీని పెంచనుందని తెలుస్తోంది. ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని మమతా బెనర్జీ సర్కారు నిర్ణయించిందట. ఇప్పటిదాకా దాదాకు వై కేటగిరీ ప్రొటెక్షన్ ఉండగా.. ఆ గడువు ముగిసింది. దీంతో సెక్యూరిటీని మరింత పెంచాలని దీదీ సర్కారు డిసైడ్ అయిందట. ఇక మీదట గంగూలీకి 8 నుంచి 10 మంది పోలీసులు అన్నివేళలా రక్షణగా ఉంటారు. తనకు సెక్యూరిటీ పెంచమని గంగూలీ కోరనప్పటికీ.. ఆయనకు మరింత భద్రత అవసరమని గవర్నమెంట్ భావించినట్లు సమాచారం. వీవీఐపీల సెక్యూరిటీ గడువు పూర్తవడంతో అధికారులు సమీక్ష జరిపారు. ఆ సమీక్షలో గంగూలీ భద్రతను జెడ్ కేటగిరీకి పెంచాలని నిర్ణయించారట. ఇప్పటిదాకా ఆయనకు స్పెషల్ బ్రాంచ్ నుంచి ముగ్గురు పోలీసులు అధికారులు రక్షణ కల్పిస్తూ వచ్చారు.
స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో పాటు మరో ముగ్గురు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంగూలీ ఇంటి వద్ద కాపలా ఉంటున్నారు. ఇకపై దాదా సెక్యూరిటీ బృందంలో మరింత మంది పోలీసులు చేరనున్నారట. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ.. మే 21న కోల్‌కతాకు తిరిగొస్తాడు. అప్పటి నుంచి ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించనున్నారని సమాచారం. మామూలుగా వీఐపీల విషయంలో దాడి జరిగే సమాచారం ఉన్నప్పుడు లేదా ముప్పు అధికంగా ఉన్నప్పుడు సెక్యూరిటీని పెంచుతారు. గతంలో ఇంటెలిజెన్స్ సూచనలతో ఎంఎస్ ధోనీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. ముప్పు లేదని తేలడంతో తర్వాత సెక్యూరిటీని కుదించారు. ఈ నేపథ్యంలో దాదాకు భద్రతను పెంచడాన్ని బట్టి ఆయనకు ఏదైనా ముప్పు ఉందా అనే అనుమానం రేకెత్తుతోంది. ఇకపోతే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో గంగూలీకి స్నేహ సంబంధాలున్న విషయం విదితమే.
Sourav Ganguly’s security will be upgraded to the Z category by the West Bengal Government. pic.twitter.com/ruUIq71rWM
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 17, 2023