ఒకప్పటి కంటే ఇప్పుడు టెక్నాలజీ ఎన్నో రెట్టు అభివృద్ధి చెందింది. అధునాతన సాంకేతికత వినియోగం క్రికెట్లో కూడా బాగా పెరిగింది. అయితే ఇప్పటికీ కొన్ని రూల్స్ విషయంలో మాత్రం అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయం తీసుకోకపోవడంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
క్రికెట్లో ఒకప్పటి కంటే ఇప్పుడు టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. అధునాతన సాంకేతిక ఉపయోగం జెంటిల్మన్ గేమ్‌లో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. అయితే టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో సరైన ఫలితాలను ఇవ్వని పాత పద్ధతులను అనుసరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. అందులో ఒకటి సాఫ్ట్ సిగ్నల్. క్యాచ్ ఔట్ల విషయంలో బ్యాట్స్‌మెన్ ఔటా? కాదా? అనే సందేహం తలెత్తినప్పుడు ఆన్‌ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు నివేదించే ముందు తమ విచక్షణకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. పూర్తిగా సాంకేతిక మీద ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా ఛాన్స్ ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ రూల్ వెనుక ఉన్న అంతస్సూత్రం. ఎల్బీడబ్ల్యూల విషయంలోనూ అంపైర్స్ కాల్స్‌ను ఇందుకే అమలు చేస్తున్నారు.
క్యాచ్ ఔట్లతో పాటు ఎల్బీడబ్ల్యూల విషయంలో అంపైర్ తన కళ్లతో పరీక్షించిన తర్వాత సందేహం ఉంటే తన నిర్ణయాన్ని చెప్పడంతో పాటు థర్డ్ అంపైర్ సాయాన్ని కూడా కోరతాడు. ఒకవేళ థర్డ్ అంపైర్ రీప్లేలో ఔట్‌కు సంబంధించిన అంశాలను గమనించిన తర్వాత ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే ఆధారాలు పక్కాగా లభిస్తే.. అతడి నిర్ణయాన్నే ఫైనల్ చేస్తారు. రీప్లేలో ఆధారాలు స్పష్టంగా కనిపించకపోతే ‘ఇన్‌కన్‌క్లూజివ్’ విషయాల్లో ఆన్‌ఫీల్డ్ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. అయితే ఒక్కోసారి రీప్లేలో స్పష్టంగా కనిపించినా ఆన్‌ఫీల్డ్ అంపైర్ తీసుకున్న డెసిజన్ ప్రకారమే నడుచుకోవడం కాంట్రవర్సీలకు దారితీసింది. ముఖ్యంగా బౌండరీల దగ్గర పట్టే క్యాచ్‌లు పక్కన ఉండే ఫీల్డర్లకే సరిగ్గా కనిపించవు. అలాంటిది ఎక్కడో దూరంగా ఉండే అంపైర్లకు స్పష్టంగా కనిపించే ఛాన్స్ లేదు.
బౌండరీల దగ్గర పట్టిన క్యాచుల విషయంలో సాఫ్ట్ సిగ్నల్ రూల్ అమలుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. రనౌట్ మాదిరిగానే వీటి విషయంలోనూ ఆన్‌ఫీల్డ్ అంపైర్లు తమ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు వదిలేయొచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దాన్ని వాడకుండా తప్పుడు నిర్ణయాలు వెలువడుతుండటంతో ఆ నిబంధనను తీసేయాలని డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈ రూల్‌ను రద్దు చేయనుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి ఈ నిబంధనను రద్దు చేయాలనే యోచనలో ఐసీసీ ఉందట. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుందని సమాచారం. కాగా, టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ స్టేడియంలో జూన్ 7-11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
The ICC will remove soft signal forever from this WTC final.#ICC #WTCFinal pic.twitter.com/xvTaWhKAUI
— CricWatcher (@CricWatcher11) May 15, 2023