ఢీల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021 సెకెండ్ హాఫ్‌ను విక్టరీతో ప్రారంభించి మంచి జోష్ మీదుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి పేలవ ప్రదర్శన చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కి సునాయాస విజయం దొరికింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీమ్‌కు మొదటి నుంచి గడ్డు కాలమే నడిచింది. డేవిడ్ వార్నర్ డక్‌గా వెనుదిరగడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు అభిమానులు. ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోయారు. కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయం నల్లేరు మీద నడకే అయ్యింది.
కెప్టెన్‌గా రిషభ్ పంత్ చాలా బాగా రాణిస్తున్నాడు. అయ్యర్ టీమ్‌లోకి వచ్చిన తర్వాత కూడా ఫ్రాచైజ్ తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ విషయంపై ఇప్పటివరకు అయ్యర్ ఎప్పుడూ నోరు మెదపలేదు. తొలిసారి ఆ అంశంపై తన మనసులోని మాటలు బయటపెట్టాడు. ఫ్రాంచైజ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపాడు. రిషభ్ పంత్ కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘సీజన్ మొదటి నుంచి పంత్ టీమ్‌ను చాలా బాగా సమన్వయ పరుస్తున్నాడు. అతని నిర్ణయాలు, కెప్టెన్సీ చాలా బాగుంది. అందుకే ఫ్రాంచైజ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కాస్త దుందుడుకు నిర్ణయాలు తీసున్నాను. అలాంటి నిర్ణయాలు రెండేళ్లపాటు జట్టుకు బాగా ఉపయుక్తంగా ఉన్నాయి’ అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన మనసులోని మాటలను బయటపెట్టాడు అయ్యర్. కెప్టెన్సీ బాధ్యతలు తప్పడంతో తాను బ్యాట్స్‌మన్‌గా ఎంతో స్వేచ్ఛగా ఆడేందుకు వీలు దొరికిందని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.