పాక్ బౌలర్లు వరల్డ్ క్లాస్ బౌలర్లు.. పాక్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొవడం అంత సులభం కాదు. రానున్నరోజుల్లో పాక్ బౌలర్లు వరల్డ్ క్రికెట్ ను శాసిస్తారు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో పాక్ బౌలింగ్ ప్రదర్శన చూసిన తర్వాత వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ దిగ్గజాలు అన్న మాటలు. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో వారి బౌలింగ్ చూస్తే.. ఈ మాటలు అన్ని నీటి మీది రాతలుగానే కనిపిస్తాయి. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. తొలి రోజే నలుగురు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కారు. ఈ క్రమంలోనే పాక్ బౌలర్లపై కామెంట్ చేశాడు పాక్ దిగ్గజం షోయబ్ అక్తర్. మా బౌలర్లు టెస్ట్ లకు పనికిరారని,వారికి ఇంకా టెస్ట్ ల్లో ఎలా ఆడాలో తెలియట్లేదని అన్నాడు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో.. తొలిరోజు ఆధిపత్యం కొనసాగించింది ఇంగ్లాండ్. పాక్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ.. వరల్డ్ రికార్డు స్కోరును సాధించింది. ఇక పాక్ బౌలర్లలో జహీద్ మహమూద్ ఏకంగా 200లకు పైగా రన్స్ సమర్పించుకున్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లుగా పేరుగాంచిన షాహీన్ షా, హారీస్ రౌఫ్ లు కూడా ఇంగ్లాండ్ బ్యాటర్ల ముందు తేలిపోయారు. ఈ నేపథ్యంలోనే తమ బౌలర్లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్. తన యూట్యూబ్ ఛానల్లో ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ..”ఇంగ్లాండ్ ప్లేయర్లు వైరస్ బారిన పడితేనే ఇంతకొట్టారు అంటే ఇక వారు ఆరోగ్యంగా ఉంటే ఇంకెంత కొట్టేవారో. ఇక విషయంలోకి వస్తే.. పాక్ బౌలర్లను విమర్శించాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆడుతున్నవారందరు కుర్రాళ్లు. టీ20ల్లో వారు అద్భుతంగా రాణించారు. కానీ టెస్ట్ ల్లోకి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారుతాయి. దానికి వారు అలవాటు పడాలి. టెస్ట్ లు అంటే రోజంతా బౌలర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. దాంతో వారిపై సహజంగానే శారీరక, మానసిక ఒత్తిడి ఉంటుంది” అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం పాక్ లో ఉన్న బౌలర్లు అందరు టీ20 స్పెషలిస్టులు ఈ కారణంగానే వారు టెస్ట్ మ్యాచ్ లో రాణించలేకపోతున్నారని అక్తర్ అన్నాడు. అయితే వారు టెస్ట్ ల్లో రాటుతేలడానికి వారికి కొంత సమయం పడుతుందని ఈ సందర్బంగా షోయబ్ చెప్పుకొచ్చాడు. ఇక ఇలాంటి పిచ్ తయ్యారుచేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మండిపడ్డాడు షోయబ్. ఇప్పటికే పిచ్ పై విమర్శలు వస్తున్నాయని గుర్తు చేశాడు. అయితే ఇంగ్లాండ్ కోచ్ గా బ్రెండన్ మెక్ కల్లమ్ వచ్చినప్పటి నుంచి వారి ఆటతీరు మారింది. బ్యాటింగ్ కు వచ్చే ప్లేయర్లకు ప్రతీ బాల్ బాదమని చెప్పి పంపుతున్నట్లున్నాడు బ్రెండన్ మెక్ కల్లమ్ అంటూ చమత్కరించాడు. బ్యాటర్లు ఇలా ఆడుతుంటే ఏ బౌలర్ అయినా ఏమిచేయగలడు అంటూ అక్తర్ పేర్కొన్నాడు. త్వరలోనే తమ బౌలర్లు రాణిస్తారని అక్తర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.