భారత పేస్ బౌలర్లను ఉద్దేశించి పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేసర్లు తమ ఆహారపు అలవాట్ల కారణంగా బలహీనంగా కనిపిస్తారని, ఇదే వారికి పాక్ పేసర్లకు తేడా అని పేర్కొన్నాడు. పాక్ పేసర్ల ముఖాల్లో కనిపించే కసి, యాటిట్యూడ్ భారత పేస్ బౌలర్ల ముఖాల్లో కనిపించవని, ఈ వ్యత్యాసం క్రికెట్ తొలినాళ్ల నుంచే ఉందని, అందుకు కారణం మా తిండి, వాతావరణం అని తెలిపాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో పాక్ పేసర్ల ఆధిపత్యం గురించి ఆసీస్ మాజీ ఆటగాడు బ్రెట్ లీతో మాట్లాడుతూ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
పాక్ బౌలర్లు బౌలింగ్ వేసే సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించరని.. వికెట్ తీయడమే వారి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ యాటిట్యూడే వేగంగా బంతులు వేసేందుకు కావాల్సిన శక్తిని ఇస్తుందని వివరించాడు. దీనికి తోడు మేము ఎక్కువగా మాంసాహారం తింటామని, అందుకే దృఢంగా ఉంటామని, ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే సింహాల్లా పరుగెడతామని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తరం పాక్ పేసర్లలో షాహీన్ ఆఫ్రిదీ, హసన్ ఆలీల్లో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయని ఈ సందర్భంగా ఉదహరించాడు. మరి అక్తర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.