శివ్‌నారాయణ్ చంద్రపాల్.. కళ్ల కింద తెల్లటి రంగు పూసుకుని, జిడ్డు బ్యాటింగ్‌తో విసుగుతెప్పించే ప్లేయర్‌గా మాత్రమే మనకు తెలుసు. కానీ.. గాయంతో రిటైర్డ్ హర్ట్ అయి.. బ్యాటర్లంతా అవుటైన వేళ, గెలుపు కోసం చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమైనప్పుడు.. నొప్పితో వణుకుతున్న చేతితోనే వరుసగా మూడు బౌండరీలు కొట్టి మ్యాచ్ గెలిపించిన ఇన్నింగ్స్ కూడా ఒకటుంది. ఆ ఒక్క ఇన్నింగ్స్ చూస్తే అతనికి క్రికెట్ పట్ల ఉన్న అంకితభావం, ప్రేమ అర్థం అవుతాయి. అసలు అతనో లెజెండరీ క్రికెటర్ ఎందుకయ్యాడో తెలుస్తుంది.
1994లో వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన చంద్రపాల్ విండీస్ ఆల్‌టైమ్ బ్యాటర్లలో ఒకడు. తన విభిన్నమైన బ్యాటింగ్ శైలితో చంద్రపాల్ ప్రపంచ క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు. తన కెరీర్‌లో ఒక మ్యాచ్ మాత్రం క్రికెట్ మనుగడ సాగించినంత కాలం గుర్తుంటుంది. అదే.. 2002లో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డే. ఆ మ్యాచ్‌లో 292 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన చంద్రపాల్ 13 పరుగులు చేసిన తర్వాత చేతికి గాయం అవుతుంది. ఆ నొప్పిని భరించలేక.. అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరుగుతాడు. అప్పటికి జట్టు స్కోర్ వికెట్ పడకుండా 60 పరుగులు.
ఆ తర్వాత మరో ఓపెనర్ క్రిస్ గేల్(67), బ్రియన్ లారా(47), కార్ల్ హోపర్(45), రామ్‌నరేష్ శర్వాణ్(52) విండీస్ ఇన్నింగ్స్‌ను లాక్కొస్తారు. కానీ.. గెలుపుకు కొద్ది దూరంలో.. 274 పరుగుల వద్ద విండీస్ ర్యాన్ హిండ్స్ రూపంలో ఆరో వికెట్ కోల్పోతుంది. దీంతో 10 బంతుల్లో విండీస్‌కు 18 పరుగులు అవసరం అవుతాయి. తర్వాత వచ్చే వారంతా బౌలర్లు కావడంతో మ్యాచ్ గెలవడం అసాధ్యమనిపిస్తుంది.
కానీ. ఎవరూ ఊహించని విధంగా రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన చంద్రపాల్ ఆ గాయాన్ని సైతం లెక్కచేయకుండా బ్యాటింగ్‌కు వస్తాడు. విండీస్‌కు తర్వాతి నాలుగు బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే వస్తాయి. దీంతో చివరి ఓవర్‌లో గెలుపు కోసం 15 పరుగులు కావాలి. స్ట్రైక్‌లో చేతి గాయంతో ఇబ్బంది పడుతున్న చంద్రపాల్ ఉంటాడు. తొలి బంతికి సింగిల్ తీసి స్ట్రైక్‌ను వావిల్ హిండ్స్‌కు ఇస్తాడు. రెండో బంతికి అతను కూడా సింగిల్ మాత్రమే తీయడంతో స్ట్రైక్ మళ్లీ చంద్రపాల్‌కే వస్తుంది.
4 బంతుల్లో 13 పరుగులు కావాలి.. చంద్రపాల్ ఎడమచేయి వణికిపోతూ ఉంటుంది. నొప్పితో అతను కూడా బాగా ఇబ్బంది పడుతుంటాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లు సైతం చంద్రపాల్ దగ్గరికొచ్చి అతని చేతి నొప్పి ఎలా ఉందని తెలుసుకుంటారు. చంద్రపాల్ మాత్రం మ్యాచ్ గెలవాలనే సంకల్పంతో వణుకుతున్న చేతితోనే న్యూజిలాండ్ స్పీడ్ బౌలర్ డారిల్ టఫ్ఫీని ఎదుర్కొంటాడు. భరించలేని నొప్పితోనే వరుసగా మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్ విండీస్ చేతుల్లో పెట్టేస్తాడు.
చివరి బంతికి సింగిల్ తీయడంతో విజయ లాంఛనం పూర్తవుతుంది. అసాధ్యం అనుకున్న గెలుపును.. చేతికి దెబ్బతిగిలినా.. నొప్పిని భరించి చంద్రపాల్ విండీస్‌ను గెలిపిస్తాడు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య విండీస్ మ్యాచ్ గెలవడంతో స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు సంతోషం పట్టలేక ఒక్కసారిగా గ్రౌండ్‌లోకి దూసుకోస్తారు. ఈ ఇన్నింగ్స్‌తో చంద్రపాల్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.
చేతి గాయంతోనే మ్యాచ్‌ను గెలిపించిన తీరు, పైగా జిడ్డు బ్యాటింగ్‌తో విసుగుపుట్టిస్తాడనే అపఖ్యాతికి చంద్రపాల్ ఈ ఇన్నింగ్స్‌తో సమాధానం ఇస్తాడు. జట్టుకు అవసరం అయినప్పుడు తనలోని హిట్టర్‌ను బయటకు ఎలా తేవాలో తనకు తెలుసనేలా ఒక హీరోయిక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్ తర్వాత చంద్రపాల్ పోరాట పటిమకు ప్రపంచ క్రికెట్ సెల్యూట్ చేసింది. గాయంతో రిటైర్డ్ హర్ట్ అయి.. మళ్లీ తిరిగొచ్చి అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్ గెలిపించిన ప్లేయర్‌గా చంద్రపాల్ క్రికెట్ చరిత్రలో మిగిలిపోతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చంద్రపాల్ చివరి ఓవర్‌లో చేసిన మ్యాజిక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కోహ్లీ కాబట్టి ఇలా చేస్తున్నాడు! అదే బాబర్ అజమ్ అయితే..