అలసత్వమో.. అత్యవసరమో కానీ.. ఫైట్ మిస్ చేసుకున్నందుకు టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో స్థానం కోల్పోయాడు షిమ్రాన్ హెట్‌మైర్. ఈ వెస్టిండీస్ స్టార్ హిట్టర్‌ను టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పిస్తూ.. విండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అందుకు అతను రెండు సార్లు ఫ్లైట్‌ను ఎక్కకపోవడమే కారణం. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2022 కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఈ జట్టులో హెట్‌మైర్ కీ ప్లేయర్‌గా ఉన్నాడు. కాగా.. వరల్డ్ కప్ ముందు వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అందుకోసం వరల్డ్ కప్‌కు ముందే ఈ సిరీస్ కోసం విండీస్ టీమ్ కంగారుల గడ్డకు చేరుకుంది. సిరీస్ తర్వాత వరల్డ్ కప్ కూడా అక్కడ కావడం, మెగా టోర్నీకి ముందు మంచి ప్రాక్టీస్ లాంటి సిరీస్ కావడంతో వరల్డ్ కప్ టీమ్‌తోనే వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు పయనమైంది.
కానీ.. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న హెట్‌మైర్ మాత్రం జట్టుతో పాటు రాలేనని, కొన్ని వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నాయని, తర్వాత వస్తానని తొలుత వెస్టిండీస్ బోర్డుకు రిక్వెస్ట్ చేసుకున్నాడు. సరేనని బోర్డు మరో సారి హెట్‌మైర్ కోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఫ్లైట్ టిక్కెటు బుక్ చేసింది. ఈ సారీ ఎలాంటి సమాచారం లేకుండా హెట్‌మైర్ విమానం ఎక్కలేదు. దీంతో అతన్ని వరల్డ్ కప్ టీమ్ నుంచి తప్పిస్తూ.. విండీస్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో షమారా బ్రూక్స్‌ను జట్టులోకి తీసుకుంది. వరల్డ్ కప్ ఆడాలని ఎంతో మంది క్రికెటర్లు కలలు కంటుంటే హెట్‌మైర్ మాత్రం ఇంత నిర్లక్ష్యంగా జట్టులో స్థానం పొగొట్టుకున్నాడు.
ఇప్పటికే వెస్టిండీస్ స్టార్ క్రికెటర్లు రస్సెల్, సునీల్ నరైన్ లాంటి వాళ్లు జట్టులో లేరు. వివిధ కారణాలు, బోర్డుతో విభేదాలతో వాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు హెట్‌మైర్ కూడా దూరం కావడంతో విండీస్ టీమ్ మరింత బలపడింది. కాగా.. ఆటగాళ్ల విషయంలో మెతక ధోరణిని పక్కనపెట్టిన విండీస్ బోర్డు కొంత కాలంగా కఠినంగానే వ్యవహరిస్తుంది. జాతీయ జట్టుకు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న లీగ్‌లకే ఆటగాళ్లు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బోర్డు కఠినంగా వ్యవహరిస్తోంది. కాగా.. విండీస్ బోర్డు నిర్ణయాన్ని ఆ దేశ క్రికెట్ అభిమానులు సమర్ధిస్తున్నారు. వివిధ లీగ్‌లు ఆడేందుకు మాత్రం టైమ్‌కు వెళ్లే ఆటగాళ్లు జాతీయ జట్టుకు అది కూడా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి వెళ్లేందుకు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా ఉంటారని మండిపడుతున్నారు.
కాగా.. హెట్‌మైర్ స్థానంలో వరల్డ్ కప్ టీమ్‌కు ఎంపికైన షమారా బ్రూక్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటివల వెస్టిండీస్‌లో ముగిసిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2022లో మంచి ప్రదర్శన కనబర్చాడు. ఈ ప్రదర్శన ఆధారంగానే హెట్‌మైర్ స్థానంలో బ్రూక్స్‌ను జట్టులోకి తీసుకుంది విండీస్ బోర్డు. హెట్‌మైర్‌ను టీ20 వరల్డ్ కప్‌తో పాటు అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ నుంచి కూడా తప్పించారు. కాగా.. స్కాట్లాండ్‌తో ఈ నెల 16న జరగబోయే మ్యాచ్‌తో వెస్టిండీస్ తమ వరల్డ్ కప్ వేటను ఆరంభించనుంది.
Shimron Hetmyer has been dropped from West Indies’ squad for the #T20WorldCup after missing his flight to Australia.
Shamarh Brooks has been selected as his replacement pic.twitter.com/ZLBWuYUc4J
— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2022