టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రెండేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తన విడాకుల గురించి ఎక్కడా నోరు విప్పలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివాహం, విడాకులపై స్పందించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
టీమిండియా ఓపెనర్ల ప్రస్తావన వస్తే.. శిఖర్ ధావన్ గురించి మాట్లాడుకోకుండా ఆ చాప్టర్ పూర్తి కాదు. ఓపెనర్‌గా దశాబ్దం పాటు.. ఓ వెలుగు వెలిగాడు శిఖర్ ధావన్. వయసు, ఫిట్‌నెస్ తదితర కారణాల వల్ల గత కొంత కాలంగా టీమ్‌కు దూరంగా ఉన్నాడు. జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తున్నాడు. కెరీర్ సంగతి పక్కకు పెడితే.. వ్యక్తిగత జీవితంలో కూడా అనేక ఒడిదుడుకులు చవి చూశాడు ధావన్. అతడి వైవాహిక జీవితం.. ముగిసిన సంగతి తెలిసిందే. ధావన్ వయసులో తనకంటే పదేళ్ల పెద్దదైన అయేషా ముఖర్జీని 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అయేషాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా సరే ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు ధావన్. వీరికి 2014లో జొరావర్ అనే కుమారుడు పుట్టాడు.
ఎనిమిదేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాఫిగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. 2021, సెప్టెంబర్ నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అప్పటినుంచి తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మాట్లాడని గబ్బర్ తొలిసారి తాను, అయేషా విడిపోడంపై స్పందించాడు. విడాకులకు కారణాలు, రెండో పెళ్లిపై తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ.. ‘‘వివాహం అనే పరీక్షలో నేను విఫలం అయ్యాను. ఎందుకంటే వివాహ బంధం మనుగడ అనేది ఒక్క వ్యక్తి చేతుల్లో ఉండదు. వివాహం అంటే.. ఇద్దరు, వ్యక్తులు కలిసి రాయాల్సిన పరీక్ష. మా విషయంలో తను తప్పు చేసిందని నేను అనను.. అలాగని నాది తప్పని ఒప్పుకోను. క్రికెట్ భాషలో చెప్పాలంటే.. నాకు పెళ్లి అనే ఫీల్డ్ కొత్త. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో తెలీదు. నేను 20 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా. కనుక ఆ ఆట గురించి నాకు తెలుసు. క్రికెట్ గురించి చెప్పమంటే అనర్గళంగా చెబుతా. ఎందుకంటే అది అనుభవంతో వచ్చింది’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘ఇక మా విడాకుల గురించి చెప్పాలంటే ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఒకవేళ భవిష్యత్తులో నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే.. చాలా చాలా ఎక్కువ జాగ్రత్త పడతాను. ఎలాంటి అమ్మాయి కావాలనే విషయంలో బుర్ర బద్ధలు కొట్టుకున్నా పర్లేదు కానీ.. తొందర పడను. నేను 26-27 ఏళ్ల వరకూ ఒంటరిగా ఉన్నాను. ఎవరితోనూ.. ఎలాంటి రిలేషన్‌లోనూ లేను. బయటికి వెళ్లేవాడిని, స్నేహితులతో తిరిగేవాడిని. నాకు నచ్చినట్లు.. బాగా ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఎవ్వరితో రిలేషన్‌లో మాత్రం లేను’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘అయితే నేను ప్రేమలో పడిన తర్వాత నాకు అన్నీ మధురంగానే కనిపించాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నవ్వుతూ దాటుకుంటూ పోయా. కానీ నా కళ్లకు అలుముకున్న ప్రేమ తెర తొలిగిపోతే అన్నీ ఇబ్బందిగానే అనిపిస్తాయి. ఈ సందర్భంగా నేను కుర్రాళ్లకు చెప్పేది ఒక్కటే. రిలేషన్‌లో ఉంటే, అన్నింటినీ అనుభవించండి. కోపాలు, తాపాలు, బాధలు, బ్రేకప్స్ కూడా. అంతేకానీ ఎమోషనల్ అయిపోయి, పెళ్లి మాత్రం చేసుకోకండి. ముందు కొన్నేళ్ల పాటు ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉండి, తన గురించి మీకు, మీ గురించి తనకు పూర్తిగా తెలిసిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి’’ అన్నాడు.
‘‘అంతేకాక వివాహం అనేది కూడా క్రికెట్ మ్యాచ్ లాంటిదే. కొందరికి సెటిల్ అవ్వడానికి 4-5 మ్యాచుల సమయం పడుతుంది. మరికొందరికి ఒక్క మ్యాచ్‌లోనే దొరకవచ్చు. ఇంకొందరికి ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు.. అయితే పెళ్లికి ముందు కాస్త అనుభవం మాత్రం చాలా ముఖ్యం’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరి ధావన్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ek hi to Dil hai kitni baar jeetoge Shikhar Dhawan 😭❤️ pic.twitter.com/VfZ4P3FPZi
— Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) March 26, 2023