ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో వైఫల్యం తరువాత టీమిండియాపై దారుణమైన విమర్శలు వచ్చాయి. ఇతర దేశాల ఆటగాళ్లతో పాటుగా మనదేశ దిగ్గజాలు సైతం టీమిండియా ప్లేయర్స్ పై, జట్టు సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పించారు. భారత జట్టుకు సిరీస్ కు ఓ సారథి మారుతున్నాడు అన్నది టీమిండియాపై ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే కెప్టెన్సీపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు గబ్బర్ శిఖర్ ధావన్. నన్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని నేను ఎన్నడూ భయపడలేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు శిఖర్ ధావనే సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే టీమ్ తో కలిసిన తర్వాత జట్టు గురించి, కెప్టెన్సీ పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నాడు.
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ గెలిచి మంచి జోరుమీదుంది టీమిండియా. ఇదే ప్రదర్శనతో వన్డే సిరీస్ ను సైతం గెలవాలని భావిస్తోంది. ఇక వన్డే సిరీస్ కు తాత్కాలిక సారథిగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యవహరిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భారత్ జట్టుతో కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు ధావన్. నేను కెప్టెన్సీ గురించి ఎన్నడూ ఆలోచించలేదని, అలాగే నన్ను సారథిగా తప్పిస్తారని భయపడలేదని ఈ సందర్భంగా ధావన్ చెప్పుకొచ్చాడు. అయితే కెప్టెన్ గా ఎక్కువ మ్యాచ్ లు ఆడినప్పుడు మాత్రమే కచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలమని ధావన్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే నేను కెప్టెన్ గా ఎంతో పరిణతి సాధించానని దానికి ఐపీఎల్ లో కెప్టెన్ గా వ్యవహరించడం ఎంతో పనికొచ్చిందని తెలిపాడు.
ఈ నేపథ్యంలో జట్టును బ్యాలన్స్ చేసుకుంటూ ప్లేయర్స్ కు మరిన్ని అవకాశాలు కల్పించాలి. అంతేగాని ఒకటి, రెండు అవకాశాలకే ఆటగాడి సత్తాను నిర్ణయించ కూడదని ఈ సందర్భంగా ధావన్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ ట్రోఫీని సాధించడం పెద్ద కష్టమేమీ కాదని వెల్లడించాడు. తాజాగా పంజాబ్ కెప్టెన్ గా నియమించడంపై మాట్లాడుతూ..” గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రస్తుతం ఉన్న జట్టును గొప్పగా తీర్చిదిద్దుతాను. జట్టు ఆటగాళ్లతో పాటు సిబ్బందితో కలగలసి ఉంటేనే టీమ్ లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇది జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తుంది. ఇక ఐపీఎల్ లో ఆడటం చాలా మంది ప్లేయర్స్ కల. దాంతో ఇలాంటి ట్రోర్నీలో ఆడేటప్పుడు కాస్త ఒత్తిడి ఉండటం సహజం” అంటూ ధావన్ పేర్కొన్నాడు.