టీమిండియా 2023 వరల్డ్ కప్ ధ్యేయంగా కసరత్తులు మెుదలు పెట్టింది. అందులో భాగంగానే రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త సెలెక్షన్ కమిటీని కూడా నియమించడానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టింది. అయితే 2023 లో జరిగే వరల్డ్ కప్ లో అతడికి మాత్రం కచ్చితంగా చోటు లభిస్తుందని జోష్యం చెబుతున్నాడు టీమిండియా స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్. అతడు ప్రస్తుతం ఉన్న ఫామ్ ను చూస్తే టీమ్ లో గ్యారంటీగా స్థానం లభిస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదని పైగా సెలక్షన్ కమిటీ మెుత్తం అతడి చుట్టూనే తిరుగుతుందని దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ఆటగాడికి కావాల్సినన్ని అర్హతలు కూడా ఉన్నాయని కితాబిచ్చాడు.
ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్. తొలి వన్డేలో భారత్ పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఇక రెండో వన్డే వర్షార్పణం అయ్యింది. దాంతో మూడో వన్డేలో గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది టీమిండియా. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్షన్ కమిటీ పై శిఖర్ ధావన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దినేష్ కార్తీక్.”టీమిండియాకు ఓపెనర్ గా ధావన్ నమ్మదగిన బ్యాట్స్ మెన్. అతడికి పరిస్థితులను బట్టి ఎలాఆడాలో తెలుసు. అందుకే అతడంటే సెలక్టర్లకు ఇష్టం. దాంతోనే వారంత అతడి చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మూడుపదులు వయసు దాటిన ధావన్ ను పక్కన పెట్టడం సెలక్టర్లకు చాలా తేలిక. కానీ అతడు జట్టులో ఉంటే చాలా స్థిరత్వంగా పరుగులు చేయగలడు. అందుకే అతడిని 2023 వరల్డ్ కప్ కు గ్యారంటీగా ఎంపిక చేస్తారని అనుకుంటున్నాను”అని ధావన్ పై ప్రశంసలు కురిపించాడు డీకే.
ఈ నేపథ్యంలోనే శిఖర్ ధావన్ పై బీసీసీఐకు నమ్మకం ఉంది కాబట్టే అతడికి న్యూజిలాండ్ సిరీస్ లకు సారథిగా బాధ్యతలు అప్పగించారని డీకే చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఐపీఎల్ కు ముందు మంచి అవకాశం ధావన్ కు దొరికిందని డీకే అన్నాడు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది ఐపీఎల్. ఈ టోర్నీలో పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా ధావన్ వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అటు కెప్టెన్ గా.. ఇటు ఓపెనర్ గా ఎంతో అనుభవం ఉన్న ధావన్ ను వచ్చే వరల్డ్ కప్ కు ఎంపిక చేయం ఖాయం అని కితాబిచ్చాడు దినేష్ కార్తీక్. ఇక న్యూజిలాండ్ తో బుధవారం జరిగే చివరి వన్డేలో గెలవడం ద్వారా సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది టీమిండియా.