టీమిండియాలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారు. ఇది కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఇదే పెద్ద తలనొప్పిగా మారింది సెలక్టర్లకు. ఎవరిని సెలక్ట్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే కొంత మంది నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు జట్టులో స్థానంతో పాటుగా గుర్తింపు దక్కడంలేదన్నది కొందరి వాదన. ఈ వాదనను నిజం చేస్తూ.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. టీమిండియాలో ఎంతో మంది గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉన్నారు. కానీ వారికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల లాగా తగిన గుర్తింపు రావట్లేదు. దీనికి ఓ మంచి ఉదాహరణగా శిఖర్ ధావన్ ను పేర్కొనవచ్చు అని రవిశాస్త్రి అన్నాడు.
శిఖర్ ధావన్ నేతృత్వంలో ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది టీమిండియా. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ అదే జోరును కొనసాగించాలి అనుకుంది. కానీ తొలి వన్డేలోనే ఓటమిని మూటగట్టుకుంది. 307 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. బౌలింగ్ వైఫల్యంతో పరాజయం పొందింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా సారథి శిఖర్ ధావన్ అద్భతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 77 బంతుల్లో 13 ఫోర్లతో 72 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో భారత్ ఓడిపోయినప్పటికీ ధావన్ పై ప్రశంసలు కురిపించాడు టీమిండియా మాజీ దిగ్గజం రవిశాస్త్రి. ధావన్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ..”టీమిండియాలో ఉన్న గొప్ప ఆటగాళ్లలో శిఖర్ ధావన్ ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అతడికి తగినంతగా గుర్తింపు దక్కడం లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. నిజానికి వారికంటే గొప్ప ఇన్నింగ్స్ లు చాలానే ఆడాడు ధావన్. పెద్ద పెద్ద జట్లపై అతడు ఆడిన ఇన్నింగ్స్ లే దానికి నిదర్శన” అని రవిశాస్త్రి అన్నాడు.
ధావన్ రికార్డులు చూస్తేనే తెలుస్తుంది అతడు ఎంత బ్యాలెన్సుడు ఆటగాడో.. ఇక ధావన్ ఎంత దూకుడైన ఆటగాడో మనందరికి తెలిసిందే అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. శిఖర్ అద్భుతమైన కట్ డ్రైవ్ లు, ఫుల్ కట్ షాట్లు ఆడగలడు.. పైగా బంతి బ్యాట్ పైకి వచ్చేదాక చూడటం అతడి బలం అని రవిశాస్త్రి కొనియాడాడు. ఇక కోహ్లీ, రోహిత్ చాటున ధావన్ కు గుర్తింపు దక్కడం లేదని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు ఈ మాజీ దిగ్గజం. వన్డే మ్యాచ్ ల్లో శిఖర్ అనుభవం టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ప్రస్తుతం రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను కొందరు క్రీడా నిపుణులతో పాటుగా అభిమానులు కూడా సమర్థిస్తున్నాడు. ప్రస్తుతం రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనియాంశంగా మారాయి.