టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరిగా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే.. ఈ ఏడాది జూన్ 2న దీపక్ చాహర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టగా.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా దగ్గరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రేయసి అథియా శెట్టిని మనువాడనున్నాడు. తాజాగా, భారత యువ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన ఫియాన్సీ మిథాలీ పారుల్కర్ తో ఏడడుగులు నడవనున్నాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
శార్దూల్ ఠాకూర్ కు కాబోయే భార్య మిథాలీ పారుల్కర్.. ఒక ఎంట్రప్రెన్యూర్. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న వివాహం చేసుకోనున్నట్లు మిథాలీ తెలిపింది. దీంతో పాటు వివాహ సన్నాహాలను కూడా ఆమె తెలియజేసింది. ‘శార్ధూల్ క్రికెట్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 24 వరకు అతనికి మ్యాచ్‌లు ఉన్నాయి. ఫిబ్రవరి 25న మాతో కలుస్తాడు. మా పెళ్లికి దాదాపు 200 నుంచి 250 మంది అతిథులు వస్తారని అనుకుంటున్నాం..’ అని మిథాలీ తెలిపింది.
వీరు మొదటగా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారట. కానీ, అతిథుల సంఖ్య ఎక్కువ అవడంతో ఆ విషయాన్ని పక్కనపెట్టారట. “మేము మొదటగా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అనుకున్నాం. అయితే, బంధువులు, స్నేహితులు ఎక్కువ మంది ఉండడంతో అందరినీ గోవా తీసుకెళ్లడం కష్టమని ఆ నిర్ణయం వాయిదా వేశాం..” అని మిథాలీ వెల్లడించింది. ముంబైలోని ఓ లగ్జరీ హోటల్ వీరి పెళ్లికి వేదిక కానుంది. మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో ఈ జంట పెళ్లి చేసుకోనుంది. పెళ్లి రోజు నవారీ చీర కట్టుకుంటానని, తమ పెళ్లి కేకును తానే తయారు చేస్తానని వధువు చెప్పుకొచ్చింది.
కాగా, శార్దూల్ ప్రస్తుతం బంగ్లా పర్యటనలో ఉన్నాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ఐపీఎల్ 2023 సీజన్ లో శార్దూల్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడింగ్ విధానంలో కోల్‌కతా అతడిని కొనుగోలు చేసింది. గతేడాది మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10.75 కోట్లు పెట్టి మరీ అతన్ని దక్కించుకుంది. అయితే అతను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ట్రేడింగ్ పద్ధతిలో కోల్‌కతాకు అమ్మేసింది.
KKR continue to make moves in the IPL trading window, bring in Shardul Thakur from Delhi Capitals in an all-cash deal
— ESPNcricinfo (@ESPNcricinfo) November 14, 2022