భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ రెండు దేశాల అభిమానులే కాదు యావత్ ప్రపంచం కళ్లప్పగించి మ్యాచ్ చూస్తుంది. దాయాదుల పోరు అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండాలి. ఉంటుంది కూడా. క్రికెట్ లో ఎప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య వైరం ఉంది. మైదానంలో 22 మంది క్రికెటర్లే ఆడతారు. కానీ స్టేడియంలో, టీవీ, మొబైల్స్ ముందు కోట్లాది మంది ప్రేక్షకులు నరాలు తెగ ఉత్కంఠతో మ్యాచ్ చూస్తారు. ఇక త్వరలో మరోసారి ఈ రెండు జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్-పాక్ జట్ల క్రికెట్ మ్యాచ్ అంటే ఎక్కడలేని ఉత్కంఠ. ఇక ప్రతి మ్యాచ్ లోనూ మనోలే గెలుస్తూ వచ్చారు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం లెక్క తప్పింది. గతేడాది టీ20 ప్రపంచకప్ లో, ఈ మధ్య జరిగిన ఆసియాకప్ లోనూ భారత జట్టు పాక్ చేతిలో ఓడిపోయింది. దీంతో త్వరలో టీ20 ప్రపంచకప్ లో ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పై ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలోనే షాహిద్ ఆఫ్రిది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాక్ జట్టు ఒకప్పటిలా లేదని అన్నాడు. ప్రస్తుత పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని కూడా చెప్పాడు. అందుకు తగ్గ వివరణ కూడా ఇచ్చాడు.
‘బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోనూ పాక్ జట్టు.. టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుంది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు .. భారత్, పాకిస్థాన్ ని చాలాసార్లు ఓడించింది. దీంతో టీమిండియాకు.. మా జట్టు అప్రాధాన్యంగా మారిపోయింది. దాయాదుల మధ్య వైరం కూడా పూర్తిగా కనుమరుగైపోయింది. ధోనీ తన హయాంలో భారత జట్టు అప్రోచ్ నే మార్చేశాడు. దీంతో పాక్ ని పక్కనబెట్టి.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు.. భారత్ కి ప్రధాన ప్రత్యర్ధులు అయిపోయాయి. అలానే చూశారు కూడా. కానీ ప్రస్తుతం చాలా మారిపోయింది. బాబర్ కెప్టెన్సీలో పాక్ జట్టు ఏకంగా రెండుసార్లు టీమిండియాని ఓడించింది. దీంతో తాము తీసిపారేయదగ్గ జట్టు కాదని నిరూపించుకుంది’ అని షాహిద్ అఫ్రిది చెప్పాడు.
ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇప్పటికే కంగారూ దేశానికి మన బృందం చేరుకుంది. టీమిండియా తొలి మ్యాచ్ పాక్ జట్టుతోనే ఆడనుంది. అయితే గతేడాది టీ20 ప్రపంచకప్ లో ఓటమికి ఈసారి భారత్ పక్కా ప్రతీకారం తీర్చుకుంటుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇకపోతే మెల్ బోర్న్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ టికెట్స్ ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఆ రోజు దాయాది జట్ల మధ్య జరిగే సమరాన్ని టీవీ, మొబైల్స్ ఫోన్లలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూస్తారు. ఇదంతా పక్కనబెడితే అఫ్రిది వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.