2011 ప్రపంచ కప్ గెలవడంలో కెప్టెన్ ధోనితో పాటు.. ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణించారు. ఇక ఈ విజయంలో కోచ్ గ్యారీ కిర్ స్టెన్ పాత్ర ఎంతైనా ఉంది. కానీ సెహ్వాగ్ మాత్రం అతనేం చేయలేదు మా వలనే అతనికి పేరొచ్చింది అని షాకింగ్ కామెంట్స్ చేసాడు.
భారత్ వేదికగా అక్టోబర్ లో వరల్డ్ కప్ జరగనుంది. ఇటీవలే ఈ టోర్నీ షెడ్యూల్ ని ఐసీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 న ఇంగ్లాండ్-న్యూజీలాండ్ మ్యాచ్ తో స్టార్ట్ కానున్న టోర్నీ నవంబర్ 19 న ముగుస్తుంది. ఇక అభిమానులు ఎదురు చూస్తున్న పాకిస్థాన్ తో పోరు అక్టోబర్ 15 న జరుగబోతోంది. ఈ మూడు మ్యాచులు కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి. అయితే వరల్డ్ కప్ జరగడానికి ఇంకో మూడు నెలలు సమయం ఉన్నా.. ఇప్పుడే ఈ మెగా టోర్నీ గురించి చర్చ మొదలయింది. ఏ జట్లు సెమీస్ కి వెళ్తాయో ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు అందరి కన్ను కోచ్ రాహుల్ ద్రావిడ్ పైన పడింది. ప్రస్తుత భారత జట్టుకి కోచ్ గా ఉంటున్న ద్రావిడ్.. చెత్త కోచ్, టీమిండియాకు పనికి రాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్రావిడ్ కి అండగా నిలిచాడు భారత మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. ఈ సందర్భంగా సెహ్వాగ్ చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
2011 వరల్డ్ కప్ స్వదేశంలో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచులో శ్రీలంకని ఓడించి 28 ఏళ్ళ తర్వాత మరోసారి వరల్డ్ కప్ ని ముద్దాడింది ఇండియన్ క్రికెట్ టీం. కెప్టెన్ గా ధోనితో తన మార్క్ చూపించగా.. మిగిలిన ఆటగాళ్లు సమిష్టిగా రాణించారు. వీరితో పాటుగా కోచ్ గ్యారీ కిర్ స్టెన్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఒక జట్టు విజయం సాధించడంలో కోచ్ పాత్ర ఎంతైనా ఉంటుంది. కానీ సెహ్వాగ్ మాత్రం కోచ్ గ్యారీ కిర్ స్టెన్ చేసిందేమి లేదని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ప్లేయర్ల దగ్గర దమ్ము ఉండాలి గాని కోచ్ చేతిలో ఏమి ఉండదు అని చెప్పుకొచ్చాడు. ఓ వైపు ద్రావిడ్ కి అండగా నిలుస్తూ మరోవైపు గ్యారీ కిర్ స్టెన్ విమర్శించాడు ఈ డాషింగ్ ఓపెనర్.
ఇటీవలే ఐసీసీ నిర్వహించిన వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ఈవెంట్‌కు సెహ్వాగ్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ” “ఒక్క సరి గ్రౌండ్ లోకి దిగి మంచి ప్రదర్శన చేస్తే అందరూ కోచ్‌ను అభినందిస్తారు. అలా కానిచో విమర్శిస్తారు. తమ జట్టు బాగా ఆడలేదని అభిమానులు ఇలా మాట్లాడడం సహజమే. అయితే ఆటగాళ్ల ప్రదర్శన కారణంగానే కోచ్ కి మంచి పేరు వస్తుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. ఈ నేపథ్యంలో అందరూ కోచ్ ని నిందించడం కరెక్ట్ కాదు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం ఎంత కష్టమో అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. రాహుల్ ద్రవిడ్ ఉత్తమ కోచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మైదానంలోకి దిగిన తర్వాత ఆటగాళ్లే సరిగ్గా ఆడాలి. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు గ్యారీ కిరిస్టన్ కోచ్‌గా ఉన్నారు. ఆ టోర్నీ అనంతరం ఆయన చాలా జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. కానీ ఒక్క జట్టుని కూడా విజేతగా నిలపలేకపోయాడు” అని చెప్పుకొచ్చాడు. మరి ద్రావిడ్ కి అండగా నిలిచి సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.