డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత ఓటమితో జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. ద్రావిడ్ సర్.. మీ సేవలు ఇక చాలు, కోచ్ పదవి నుంచి తప్పుకోండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
కోట్లాది మంది అభిమానించే భారత క్రికెట్ జట్టును కెప్టెన్‌గా ముందుండి నడపడం ఎంత కష్టమో.. కోచ్‌గా వెనుక ఉండి గైడ్ చేయడమూ అంతే కష్టం. ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలపాలు కాక తప్పదు. విజయాలు సాధిస్తే నెత్తిన పెట్టుకునేవారే.. ఒక్క ఓటమికి నేలకు పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఓటమితో భారత మేనేజ్మెంట్, కోచింగ్ స్టాఫ్‌కు ఇది స్పష్టంగా తెలిసొచ్చినట్లు ఉంది. ప్రతిష్టాత్మక ఫైనల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఓటమికి టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్-2021 తర్వాత భారీ అంచనాలతో టీమిండియా కోచ్‌గా బాధత్యలు తీసుకున్నాడు ద్రావిడ్. అయితే ఆయన నుంచి అభిమానులు ఆశించిన ఫలితం మాత్రం ఇప్పటివరకు రాలేదు.
కోచ్‌గా ఆరంభంలో వరుస విజయాలు అందుకున్నాడు ద్రావిడ్. అయితే దక్షిణాఫ్రికా టూర్ నుంచి సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. ఆ టూర్లో ఫస్ట్ టెస్ట్ గెలిచిన తర్వాత కూడా 1-2తో సిరీస్ కోల్పోయింది భారత్. వన్డే సిరీస్‌లోనూ వైట్‌వాష్ అయింది. ఆసియా కప్-2022లో సూపర్-4 రౌండ్ నుంచే నిష్క్రమించింది టీమిండియా. ఇక, టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ నుంచి ఇంటిదారి పట్టింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ చేతుల్లో వన్డే సిరీస్‌లో ఓడిపోయి చెత్త రికార్డు మూటగట్టుకుంది. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. అటు ఐసీసీ టోర్నీలతో పాటు ఇటు ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ ద్రవిడ్ కోచింగ్‌లో టీమ్ పెర్ఫార్మెన్స్ ఏమంత బాగోలేదు. ఇంతకుముందు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి నేతృత్వంలో భారత జట్టు విదేశాల్లోనూ దూకుడుగా ఆడి విజయాలు సాధించింది. ఇప్పుడు మాత్రం టీమ్‌లో ఆ అగ్రెషన్ కనిపించడం లేదు.
రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ద్రావిడ్ స్థానంలో కొత్త కోచ్‌ను నియమించాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. టీమ్‌కు మళ్లీ దూకుడు మంత్రం నేర్పించే వారు కావాలని చెబుతున్నారు. ద్రావిడ్ సర్.. మీ సేవలు ఇక చాలు అంటున్నారు. ఇక, కోచ్‌పై వేటు వేసేందుకు బీసీసీఐ కూడా సిద్ధమవుతోందట. ద్రావిడ్ ప్లేసులో ఎవరైతే కరెక్ట్ అనేది ఆలోచిస్తోందట. ద్రావిడ్ వారసుడిగా ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ జస్టిన్ లాంగర్‌తో పాటు టీమిండియా వెటరన్లు ఆశిష్ నెహ్రా, గౌతం గంభీర్ పేర్లు వినిపిస్తున్నాయి. కొంతమంది ఎంఎస్ ధోనీని భారత కొత్త కోచ్‌గా నియమించాలని సూచిస్తున్నారు. అయితే బీసీసీఐ మాత్రం డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ద్రావిడ్ ప్లేసులో రీప్లేస్‌మెంట్‌గా భావిస్తోందని సమాచారం. ఈ విషయంపై భారత క్రికెట్ బోర్డు సమాలోచనలు చేస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. దీంట్లో ఎంత నిజం ఉందనేది బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తే గానీ చెప్పలేం.