క్రికెట్- సినిమా రంగం మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా హీరోయిన్లను క్రికటర్లు పెళ్లాడటం, క్రికెటర్లతో హీరోయిన్లు ప్రేమలో పడటం ఇప్పటివరకు చాలానే చూశాం. మన్సూర్ అలీఖాన్- షర్మీలా ఠాగూర్, అజహరుద్దీన్- సంగీత బిజ్లానీ, హర్భజన్- గీతా బస్రా, యువరాజ్ సింగ్- హేజల్ కీచ్, జహీర్ ఖాన్- సాగరిక ఘాట్గే, విరాట్ కోహ్లీ- అనుష్క శర్మలను చూశాం. అయితే హీరోయిన్లతో ప్రేమలో ఉన్న వాళ్లు, హీరోయిన్లతో ఉన్నారంటూ పుకార్లు ఎదుర్కొంటున్న వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అయితే కొన్నిసార్లు అలాంటి వార్తలు వాళ్లకు వ్యక్తిగతంగానూ ఇబ్బందులు తీసుకురావొచ్చు. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాంటి ఒక జాబితాలోకి రుతురాజ్ గైక్వాడ్- నటి సయాలి సంజీవ్ పేర్లు చేరాయి. సయాలి సంజీవ్ ముంబైకి చెందిన ఒక నటి. ఈమె మరాఠీ సినిమాలు, టీవీ షోస్‌లో కనిపిస్తూ ఉంటుంది. అయితే రుతురాజ్ గైక్వాడ్- సయాలి సంజీవ్ రిలేషన్ ఉందంటూ పుకార్లు వచ్చాయి. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారంటూ వారికి నచ్చింది రాసుకుంటూ వెళ్లారు. అయితే ఈ పుకార్లపై సయాలి స్పందించిది. “మా మధ్య ఎలాంటి ప్రేమ లేదు. ఇలాంటి పుకార్లు వైరల్ కావడం వల్ల మా మధ్య స్నేహం కూడా దెబ్బతింది. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ లా కూడా మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఈ పుకార్ల వల్ల వ్యక్తిగతంగానూ ఇబ్బందులు పడ్డాను” అంటూ సయాలి సంజీవ్ తనపై వచ్చిన పుకార్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది.
ఇంక రుతురాజ్ గైక్వాడ్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇప్పటి వరకూ డొమెస్టిక్ క్రికెట్‌లో ఏ ఆటగాడు అందుకోని ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. సాధారణంగా ఇప్పటివరకు విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్‌లో ఏ ఆటగాడు అయినా 4 శతకాలు బాదిదే గగనంగా ఉండేది. అలాంటిది రుతురాజ్ మాత్రం ఏకంగా 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం రెండే మ్యాచుల్లో విఫలమయ్యాడు. ఈ విజయ్ హజారే ట్రోఫీ సీజన్‌లో రుతురాజ్ 10 ఇన్నింగ్స్ స్కోర్లు ఇలా ఉన్నాయి.. 136, 154(నాటౌట్), 124, 21, 168, 124(నాటౌట్), 40, 220(నాటౌట్), 168, 108. అంతేకాదు.. ఈ సీజన్‌లో ఇంకో రికార్డు కూడా క్రియేట్ చేశాడు. ఒకే ఓవర్‌లో 7 సిక్సులు బాది ఔరా అనిపించాడు.