సౌదీ అరేబియా వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్‌కు ప్లాన్ చేస్తోంది. ఈ విషయమై సౌదీ అఫీషియల్స్ బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారట.
ఇప్పుడంతా హైటెక్ యుగంగా మారింది. అందరి జీవితాలు ఉరుకుల పరుగులమయంగా మారిపోయాయి. ప్రజలు దేనికీ ఎక్కువ సమయం కేటాయించడం లేదు. క్రికెట్‌కు కూడా ఇది వర్తిస్తుందనే చెప్పొచ్చు. ఐదు రోజుల పాటు సాగే సంప్రదాయ టెస్టు క్రికెట్‌తో పాటు వన్డే క్రికెట్‌పై కూడా ఆడియెన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. రోజుల తరబడి లేదా గంటల కొద్దీ సాగే మ్యాచ్‌లను చూసేంత ఓపిక వారిలో ఉండట్లేదు. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్.. 50 ఓవర్ల ఫార్మాట్లో చివరిదని చెబుతున్నారు. వన్డేల కంటే టీ20లపై ఫ్యాన్స్‌లో చాలా ఆసక్తి కనిపిస్తోంది. టీ20 ఫార్ములాతో వచ్చిన ఐపీఎల్, బిగ్‌బాష్, బీపీఎల్, పీఎస్ఎల్ లాంటి లీగ్‌లు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలో మరో టీ20 లీగ్ రాబోతోంది.
ఈమధ్యే ఫార్మాలా-1 పోటీలకు పచ్చజెండా ఊపిన సౌదీ అరేబియా సర్కారు.. తమ దేశంలో ఒక క్రికెట్ లీగ్ నిర్వహించాలని భావిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 లీగ్ నిర్వహణకు ప్లాన్ చేస్తోంది. అంతేకాదు ఈ విషయమై సౌదీ అధికారులు బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లతో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ లీగ్‌లో ఎట్టిపరిస్థితుల్లో భారత ఆటగాళ్లను ఆడించాలని ధ్యేయంగా పెట్టుకున్నారని సమాచారం. ఒకవేళ అన్నీ కుదిరితే త్వరలో మరో భారీ లీగ్ క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఇకపోతే, బీసీసీఐ ప్రస్తుత నియమాల ప్రకారం భారత ఆటగాళ్లు ఇతర దేశాల లీగ్స్‌లో ఆడేందుకు పర్మిషన్ లేదు.