పేస్ బౌలర్లకు పెట్టింది పేరైన పాకిస్థాన్ నుంచి.. కొత్త బ్యాటర్ ఉత్తుంగ తరంగంలా దూసుకొస్తున్నాడు. క్రీజులో అడుగుపెడితే.. ప్రత్యర్థి బౌలర్లకు కొరుకుడు పడని కొయ్యలా మారిన ఈ నయా బ్యాట్స్‌మన్.. అరంగేట్రం నుంచే అదరగొడుతున్నాడు.
పాకిస్థాన్ క్రికెట్‌లో నయా సంచలనం దుమ్మురేపుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడేది ఆరో మ్యాచే అయినా.. అదరక బెదరక ఎదురు నిలుస్తూ.. పరుగుల వరద పారిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఈ లెఫ్ట్ హ్యాండర్ భారీ స్కోరుతో కదం తొక్కాడు. సహచరులంతా విపలమైన చోట.. బ్యాటింగ్ బాధ్యతను భుజానేసుకొని డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. మరి ఇందులో అడ్డదిడ్డ షాట్లతో పరుగులు రాబట్టాడా అంటే అదీ లేదు. క్రికెట్ పుస్తకాల్లోని ప్రతి ఒక్క షాట్‌ను అవపోసన పట్టినట్లు.. ఇంజమాముల్ హక్, సయీద్ అన్వర్, మహమ్మద్ యూసుఫ్‌ను ఆవాహన చేసుకున్నట్లు.. చాలా పద్ధతిగా దంచికొడుతున్నాడు. గాలే టెస్టులో లంక బౌలర్లను చెడుగుడాడుకున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు.. మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్!
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్న ఆరో టెస్టులోనే అద్వితీయ ద్విశతకంతో చెలరేగిన సౌద్ షకీల్.. గత ఐదు టెస్టుల్లో 72.50 సగటుతో పరుగులు రాబట్టడం విశేషం. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్‌లు ఆడిన షకీల్ 580 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ 5 అర్ధశతకాలు ఉన్నాయి. తాజా ద్విశతకంతో సౌద్ తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. పాకిస్థాన్ అండర్-19తో పాటు పీసీఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున సత్తాచాటిన షకీల్‌కు చాలా ఆలస్యంగా జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. గతేడాది చివర్లో అతడు తన తొలి టెస్టు ఆడాడు. రెండేండ్ల క్రితమే తొలి వన్డే ఆడిన షకీల్ మొత్తం 5 వన్డేల్లో 67 పరుగులే చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. దీంతో అతడికి అవకాశాలు సన్నగిల్లగా.. గతేడాది డిసెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు ఈ మిడిలార్డర్ బ్యాటర్‌కు అవకాశం దక్కింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని షకీల్ వరుస ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు.
రావల్పిండి వేదికగా ఆడిన తన తొలి టెస్టులోనే షకీల్ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేశాడు. అండర్సన్, రాబిన్‌సన్, బెన్ స్టోక్స్ వంటి అంతర్జాతీయ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో అతడికి వరుసగా అవకాశాలు వచ్చాయి. వాటిని అందిపుచ్చుకున్న షకీల్.. జట్టులో నుంచి తనను తీసే పరిస్థితి లేకుండా ముందుకు సాగుతున్నాడు. అనంతరం న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ రాణించిన ఈ సింధ్ బ్యాటర్.. తాజా లంక పర్యటనలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. షకీల్ నిలకడ చూసినవాళ్లు.. పాకిస్థాన్‌కు మరో బాబర్ ఆజమ్ దొరకాడని వ్యాఖ్యానిస్తున్నారు.