సాధారణంగా ప్రతీ ఒక్కరి జీవితంలో దాదాపుగా ప్రేమతాలుకు జ్ఞాపకాలు ఉంటాయి. కొన్ని ప్రేమలు విజయం సాధిస్తే.. మరి కొన్ని ప్రేమలు విఫలమవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ క్రికెటర్ సంజూ శాంసన్ తన ప్రేమ వివాహం గురించి పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నారు. తను ప్రేమలో పడ్డ కష్టాల గురించి, తమ పరిచయం గురించి చెప్పుకొచ్చాడు. తన భార్య చారులతకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత తమ మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపాడు శాంసన్. తన పెళ్లి గురించి మరిన్ని విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. శాంసన్ పెళ్లి గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సంజూ శాంసన్.. టీమిండియా లో ప్రతిభ కలిగిన ఆటగాళ్లలో ఒకడు. దేశవాలీ మ్యాచ్ ల్లో రాణిస్తున్నప్పటికీ సెలక్టర్ల కన్ను మాత్రం శాంసన్ పై పడట్లేదు. టీ20 వరల్డ్ కప్ కు ముందు కేరళలో టీమిండియా మ్యాచ్ ఆడటానికి వెళ్తే.. అక్కడ శాంసన్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ అతడికి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదని కేరళలో శాంసన్ అభిమానులు కటౌట్ లు పెట్టి మరీ సెలక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శాంసన్.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో ఓడిపోవడంతో నార్మల్ గానే తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకున్నాడు.
ఈ సందర్భంగా తన లవ్ మ్యారేజ్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అసలు చారులత-శాంసన్ మధ్య ప్రేమ ఎలా మెుదలైందో తెలిపాడు. చారులత-సంజూ శాంసన్ కేరళలోని తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. చారులత డిగ్రీ చదివుతుండగా.. సంజూ ఇంగ్లీష్ లిటరేచర్ చదివేవాడు. మెుదట్లో ఇద్దరికి పెద్దగా పరిచయం ఉండేది కాదు. కానీ ఓ సారి చారులతకు శాంసన్ ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె కూడా ఆ రిక్వెస్టు ను యాక్సెప్ట్ చేసినట్లు సంజూ తెలిపాడు. ఆ తర్వాత చిన్నగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలిని నిర్ణయించుకున్నారు. సంజూ-చారులత జంట ప్రేమలోనే 5 సంవత్సరాలు విహరించారు.
అనంతరు ఇరు కుటుంబాలను ఒప్పించి 2018 డిసెంబర్ 22 న కవోలమ్ లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మతాలు వేరైనప్పటికీ వీరు వివాహం చేసుకున్నారు. శాంసన్ క్రిస్టియన్ కాగా చారులత హిందు. చారులత ఎంట్రప్రెన్యూర్ గా తన ప్రొఫెషన్ కొనసాగిస్తోంది. తను హ్యూమన్ రిసోర్స్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ సైతం చేసింది. ఇక వీరిద్దరు కలిసి మెలిసి దిగిన ఫొటోలను చారులత తన సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్ చేస్తునే ఉంటుంది. ఫేస్ బుక్ లో ఒక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ తో మెుదలైన మా ప్రేమ.. 5 ఏళ్ల తర్వాత పెళ్లి అనే బంధంతో ఒక్కటైందని ఈ సందర్భంగా శాంసన్ చెప్పుకొచ్చాడు.