పరుగుల యంత్రం… ఈ పేరు వినగానే ఎవరైనా టక్కున విరాట్ కోహ్లీ అనేస్తారు. భారత క్రికెట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను ఎవరైనా సాధించగలరా అంటే అది కోహ్లీనే. ఈ మాట ఎందరో మాజీ ఆటగాళ్లు ఎన్నో సందర్భాల్లో అన్నారు. కోహ్లీ రికార్డులు చూస్తే అది నిజమే అని అందరూ ఒప్పుకోవాల్సిందే. కోహ్లీ క్రీజులో ఉంటే ఎంతటి టార్గెట్ అయినా సునాయాసంగా గెలిచేస్తామని టీమ్ సభ్యులే కాదు, అభిమానులు కూడా గట్టిగా నమ్ముతారు. కోహ్లీ టీమ్‌లో ఉన్నాడంటే చాలా జాగ్రత్తగా ఆడాలని ప్రత్యర్థి జట్లు అనుకుంటాయి. 13 ఏళ్ల వన్డే క్రికెట్‌లో కోహ్లీ సాధించిన ఘనతలేంటో ఓసారి చూసేద్దాం.
పరుగుల యంత్రం అన్న పేరు ఊరికే రాలేదు. విరాట్ కోహ్లీ రికార్డులు చూస్తే ఎవరైనా ఆ మాట అనాల్సిందే. కోహ్లీ రికార్డులు ఎవరైనా బద్దలు కొడతారు అన్న ఆలోచన కూడా ఎవరికీ లేదు. వన్డే క్రికెట్‌లో 245 ఇన్నింగ్స్‌లో 12,169 పరుగులతో విరాట్ ఆరో స్థానంలో ఉన్నాడు. 452 ఇన్నింగ్స్‌లో 18,426 పరుగులతో లెజెండ్ సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. టాప్ బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో విరాట్ కంటే ముందున్న మహెళ జయవర్దనే 418 ఇన్నింగ్స్‌లో 12,650 పరుగులు సాధించాడు.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే. లిస్ట్‌లో టాప్‌లో ఉన్న మాస్టర్ సచిన్ బ్యాటింగ్ యావరేజ్ 44.83. అదే సమయంలో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 59.07గా ఉంది. అంటే బ్యాటింగ్ యావరేజ్ చూస్తే కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది విరాట్ ఎందుకు పరుగుల యంత్రంగా పిలవబడుతున్నాడో.
ఛేజింగ్ అంటే విరాట్ విరుచుకుపడతాడు!
టీమిండియా ముందు ఎంత పెద్ద టార్గెట్ ఉంటే… విరాట్ అంత రెట్టించిన ఉత్సాహంతో ఆడతాడు అనడం అతిశయోక్తి కాదు. అతని రికార్డులు చూస్తే మనకు అదే అనిపిస్తుంది. హోబర్ట్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా, భారత్ ట్రై సిరీస్ నడుస్తోంది. భారత్ బరిలో నిలవాలంటే 40 ఓవర్లలోపు 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. అప్పటికే సెహ్వాగ్, సచిన్ పెవిలియన్ చేరారు. విరాట్ బ్యాటింగ్‌తో అందరి మతులుపోయాయి. కోహ్లీ 133 నాటౌట్‌గా నిలిచి 36.4 ఓవర్లలోనే లక్ష్యం సాధించాడు. 2012 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 183 నాటౌట్, 2016 న్యూజిలాండ్‌పై మొహాలీలో 154 నాటౌట్, 2017లో ఇంగ్లాండ్‌పై 122 పరుగులు చూస్తే ఛేసింగ్‌లో విరాట్ ఎంత అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేస్తాడో అర్థమవుతుంది.
ఛేజింగ్‌లో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 68.09. టాప్ లిస్ట్‌లో ఉన్న లెజెండ్స్‌లో ఎవరైనా కోహ్లీకి దగ్గర్లో ఉన్నారు అంటే, అది మాస్టర్ సచినే. ఛేజింగ్‌లో సచిన్ బ్యాటింగ్ యావరేజ్ 42.33గా ఉంది. ఛేజింగ్‌లో సెంచరీల విషయానికొస్తే టాప్ లిస్ట్‌లో ఉన్న ముగ్గరు శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేసిన సెంచిరీల కంటే విరాట్ 3 ఎక్కువే చేశాడు. సంగక్కర (7), జయసూర్య(10) , జయవర్దనే(6) సెంచిరీలు చేశారు. కోహ్లీ వన్డే ఛేసింగ్‌లో 26 శతకాలు బాదాడు.
సచిన్, కోహ్లీ 13 ఏళ్ల వన్డే కెరీర్:
వన్డే క్రికెట్‌లో సచిన్, కోహ్లీ 13 ఏళ్ల కెరీర్ రికార్డులు చూస్తే సచిన్ 291 ఇన్నింగ్స్‌లో 44.2 యావరేజ్‌తో 11,544 పరుగులు చేశాడు. సచిన్ 86.55 స్ట్రైక్ రేట్‌తో 33 శతకాలు, 56 అర్ధశతకాలు చేశాడు. సచిన్ హైఎస్ట్ స్కోర్ 186 నాటౌట్. ఇక, కోహ్లీ 245 ఇన్నింగ్స్‌లో 59.07 యావరేజ్‌తో 12,169 పరుగులు చేశాడు. వాటిలో 43 శతకాలు, 63 అర్ధశతకాలు ఉన్నాయి. 93.17 స్ట్రైక్ రేట్, 183 హైఎస్ట్ స్కోర్‌గా ఉంది. అందుకే విరాట్‌కు పరుగుల యంత్రం అన్న పేరొచ్చింది.