భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కాబోయే రోడ్ సేఫ్టీ సిరీస్ లో సచిన్ ఆటను వీక్షించే అవకాశం అభిమానులకు దక్కనుంది. ఈ మేరకు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రెండో సీజన్ షెడ్యూలు ప్రకటించారు నిర్వాహకులు. అంతేకాదు.. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న ‘ఇండియా లెజెండ్స్’కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సారథ్యం వహించనున్నాడు.
సెప్టెంబర్ 10 నుంచి ఆక్టోబర్ 1 వరకు 22 రోజుల పాటు ఈ సిరీస్ జరగనుంది. కాన్పూర్, ఇండోర్, డెహ్రాడూన్ లో లీగ్ మ్యాచులు జరగనుండగా, సెమీ ఫైనల్, ఫైనల్ రాయ్‌పూర్ వేదికగా జరగనున్నాయి. టీ20 ఫార్మాట్ లో ఈ టోర్నీ జరుగుతుంది. ఈ ఎడిషన్‌లో కొత్తగా న్యూజిలాండ్ టీమ్ కూడా చేరడంతో మొత్తం జట్ల సంఖ్య 8కి చేరింది. ఈ టోర్నీలో కేవలం రిటైర్డ్ క్రికెట్లరు మాత్రమే పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో రహదారి భద్రత గురించి జనాల్లో అవగాహన కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి రవాణా, సమాచార, ప్రసార, క్రీడల మంత్రిత్వశాఖలు సహకారం అందించనున్నాయి.
ఇక, గతేడాది జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తొలి సీజన్‌లో సచిన్ కెప్టెన్సీలోనే ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్ మట్టికరిపించి భారత్ జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ 181 పరుగులు చేయగా, శ్రీలంక లెజెండ్స్ 167 పరుగులకే పరిమితమయ్యింది.
పాల్గొనబోయే జట్లు:
ఇండియా లెజెండ్స్:
సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), నమన్ ఓజా(కీపర్), మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, సుబ్రమణ్యం బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, మన్ప్రీత్ గోని, మునాఫ్ పటేల్, ప్రగ్యాన్ ఓజా, రాజేశ్ పవార్, వినయ్ కుమార్, నోయల్ డేవిడ్.
ఈ మ్యాచులు Colors Cineplex, Colors Cineplex superhits & Sports18 Khel టీవీ ఛానల్స్ లో ప్రసారం కానున్నాయి. అలాగే.. డిజిటల్‌గా VOOT & Jioలో ప్రసారం కానున్నాయి. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.