అందరూ ఆయన్ని క్రికెట్ లో లెజెండ్ అంటారు. ఎందుకంటే ఎన్నో వేలకొద్ది పరుగులు. లెక్కలేనన్ని రికార్డులు. ఇప్పుడున్న ఎంతోమంది యువ క్రికెటర్లకు ఆయనే ఇన్సిపిరేషన్. ఆయనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్. అంత పెద్ద క్రికెటర్ అయినా సరే పిల్లలు కనిపిస్తే ముద్దు చేయకుండా అస్సలు వదలరు. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సచిన్ ఫ్యాన్స్.. ఈ వీడియోకి తెగ లైకులు కొడుతున్నారు. ఇంతకీ సచిన్- ఆ పిల్లాడు కలిసి ఏం మాట్లాడుకున్నారు? ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. దిగ్గజ సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కి 2013లోనే రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత ఐపీఎల్ ముంబయి ఇండియన్స్ జట్టుకి మెంటార్ గా వ్యవహరిస్తూ వచ్చారు. గత కొన్నాళ్లు నుంచి రోడ్ సేఫ్టీ సిరీస్ లో సచిన్.. మన జట్టుకి కెప్టెన్ గా చేస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లోనూ మన జట్టుని ఫైనల్ కి తీసుకొచ్చారు. ఈ బుధవారం ఆస్ట్రేలియా లెజెండ్స్ తో సెమీఫైనల్ జరగ్గా.. అందులో 5 వికెట్ల తేడాతో గెలిచిన మన జట్టు.. ఫైనల్లో అడుగుపెట్టింది. ఇర్ఫాన్ పఠాన్.. ఈ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
ఇక మ్యాచ్ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ కొడుకు ఇమ్రాన్ తో సరదా ముచ్చట పెట్టిన సచిన్.. ‘మేం ఈ రోజు మ్యాచ్ ఎలా గెలిచామో తెలుసా? ఆయనెవరో తెలుసు కదా! ఆయనే టప్ టప్ మని సిక్సులు కొట్టాడు. అలా మేము గెలిచేశాం’ అని బుడ్డోడిని ముద్దు చేశారు. ఈ వీడియోని ఇర్ఫాన్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేయగా.. సచిన్ ఫ్యాన్స్ తెగ లైకులు కొడుతున్నారు. మాస్టర్.. చిన్న పిల్లలతో బాగా కలిసిపోతారు. ముద్దు చేయడంలో ముందుంటారు అని నెటిజన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా సెమీ ఫైనల్లో ఆఖర్లో మెరుపులు మెరిపించిన ఇర్ఫాన్ పఠాన్.. 12 బంతుల్లో తలో రెండు ఫోర్లు, సిక్సులు కొట్టి 37 పరుగులు చేశారు. ఇక ఫైనల్.. శనివారం సాయంత్రం జరగనుంది. మరి సచిన్ క్యూట్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.