సచిన్ టెండూల్కర్.. ఇండియన్ క్రికెట్ గాడ్. క్రికెట్‌ను మతంలా భావించే దేశంలో ఒక వ్యక్తిని దేవుడిలా కీర్తిస్తారంటే.. అతను ఆ ఆటలో ఎలాంటి ఉన్నత శిఖరాలను చేరుకుని ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్న సచిన్.. అన్నేళ్ల పాటు ఆటగాడిగా కొనసాగడమే గొప్ప విషయం అనుకుంటే.. ఆడినంత కాలం అద్భుతంగా రాణించడం మరో విశేషం. అయినా.. ఒక ఆటగాడు 24 ఏళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించాడంటే.. ఆ ఆటగాడికి ఆట పట్ల, అతని దేశం పట్ల ఎంత అకింతభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమిస్తూ.. అంత డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లేన్‌తో ఉన్నాడు కాబట్టే.. సచిన్ ఒక లెజెండ్ అయ్యాడు. క్రికెట్‌లో కొన్ని వందల రికార్డులు బద్దలు కొట్టి.. మరికొన్ని వందల రికార్డులను నమోదు చేసిన సచిన్.. అంత గొప్ప ఆటగాడు కావడానికి కారణం కేవలం ఆట మాత్రమే అనుకుంటే పొరపాటే.. ఆట పట్ల అతనికున్న అంకితభావం కూడా అందుకు మరో కారణం. క్రికెట్ ఆడుతున్న సమయంలో సచిన్ శరీరంలో గాయం కాని భాగం లేదంటే అతిశయోక్తి కాదు. క్రికెట్‌ను సచిన్ ఏ స్థాయిలో ప్రేమించేవాడో చెప్పే ఘటనలు, సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో ఒక దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
సచిన్ అంటే టీమిండియా.. టీమిండియా అంటే సచిన్ అనే విధంగా ఉన్న రోజులు. అప్పట్లో అలా ఎందుకు భావించే వారంటే.. సచిన్ ఆడితేనే ఇండియా గెలిచేది. సచిన్ విఫలమైతే ఇండియాకు ఓటమే. అందుకే.. సచిన్ అంటే ఇండియా.. ఇండియా అంటే సచిన్. 1999లో మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత్‌కు వచ్చింది. తొలి టెస్టు చెన్నైలో జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌట్ అయింది. లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 6, శ్రీనాథ్ 3 వికెట్లతో చెలరేగడంతో పాక్‌ను తక్కువ స్కోర్‌కే భారత్ కట్టడి చేసింది. సచిన్ టెండూల్కర్ సైతం ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక భారత్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులకే ఆలౌట్ అయింది.
ఉపఖండపు పిచ్‌లపై మిస్టరీ స్పిన్‌తో రెచ్చిపోతున్న షక్లైన్ ముస్తాక్.. సచిన్‌ను డకౌట్ చేయడంతో భారత్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. రాహుల్ ద్రవిడ్ 53, సౌరవ్ గంగూలీ 54 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా దక్కింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. ఓపెనర్ షాహిద్ అఫ్రిదీ సెంచరీతో చెలరేగడంతో ఈ సారి మంచి స్కోరే చేసింది. అఫ్రిదీ 141 రన్స్ చేయడంతో పాటు ఇంజుమామ్ ఉల్ హక్ 51 రన్స్ చేసి రాణించడంతో 286 పరుగులు చేసింది. ఈ సారి వెంకటేశ్ ప్రసాద్ 6 వికెట్లతో రాణించగా.. సచిన్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ ఎదుట 271 పరుగుల లక్ష్యం మిగిలింది.
ఈ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన టీమిండియాను.. వకార్ యూనిస్ ఆరంభంలో చావు దెబ్బ కొట్టాడు. ఓపెనర్లు సదగొప్పన్ రమేష్ 5, వీవీఎస్ లక్ష్మణ్ 0 లను అవుట్ చేశాడు. దీంతో భారత్.. 6 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. కొద్ది సేపటికే 10 పరుగులు చేసిన ద్రవిడ్‌ను వసీం అక్రమ్ అవుట్ చేయడంతో 50 పరుగుల వద్ద భారత్ 3వ వికెట్ కోల్పోయింది. ఇలా 73కు 4, 82కు 5వ వికెట్ కోల్పోయింది టీమిండియా. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో వైపు సచిన్ మొండిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ పేసర్లుగా ఉన్న వకార్ యునిస్, వసీం అక్రమ్ నిప్పులు చెరుగుతుంటే.. మిగతా బ్యాటర్లు విఫలమైనా సచిన్ మాత్రం వారిపై ఎదురుదాడికి దిగుతూ.. సంచలన బ్యాటింగ్ చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా దానికి ప్రతీకారంగా.. భీకరమైన పాక్ బౌలింగ్ ఎటాక్‌ను పిచ్చికొట్టుడు కొట్టాడు. సచిన్‌కు తోడుగా నయన్ మోంగియా 52 పరుగులతో తోడ్పాటు అందించడంతో సచిన్ సెంచరీతో కదంతొక్కాడు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్‌కు 100పైగా పరుగులు జోడించారు. 271 పరుగులు ఛేదించే క్రమంలో 218 పరుగుల వద్ద మోంగియా అవుట్ అయ్యాడు. అయినా సచిన్ ఉన్నండటంతో అంతా టీమిండియా విజయం అనుకున్నారు. కానీ.. విజయం ముంగిట్లో 254 పరుగుల వద్ద ముస్తాక్ బౌలింగ్‌లో సచిన్ 7వ వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత.. మరో సారి పాక్ బౌలర్లు చెలరేగిపోయారు. సచిన్ అవుట్ తర్వాత 4 పరుగుల వ్యవధిలో చివరి 3 వికెట్లు కూల్చి.. కేవలం 12 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించినా.. 3 వికెట్లు తీసుకోవడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో అసాధారణ పోరాటం చేసిన సచిన్ టెండూల్కర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ఈ అవార్డు ప్రదానం చేసేందుకు సచిన్‌ను ఆహ్వానించారు. కానీ.. ఆ అవార్డు స్వీకరించేందుకు సచిన్ రాలేదు. నిర్వహకులు కారణం ఏంటని కనుక్కుంటే.. డ్రెస్సింగ్ రూమ్‌లో సచిన్ చిన్నపిల్లాడిలా ఏడుస్తూ కూర్చున్నాడని, అందుకే అవార్డు తీసుకునేందుకు రాలేదని తెలిసింది. అప్పటికే ప్రపంచ క్రికెట్‌లో గొప్ప బ్యాటర్‌గా ఉన్న సచిన్. ఒక్క మ్యాచ్ ఓడితే ఇంత బాధపడాలా అనుకున్నారు అప్పట్లో చాలా మంది. కానీ.. ఇండియా మ్యాచ్ ఓడిపోయింది పాకిస్థాన్‌పై.. అది కూడా మన సొంత గడ్డపై కేవలం 12 పరుగుల తేడాతో ఓడింది.
తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసినా.. ప్రపంచ వ్యాప్తంగా హేమాహేమీ బ్యాటర్లను తమ పేస్, స్వింగ్‌తో వణికిస్తున్న వసీం అక్రమ్, వకార్ యూనిస్ లాంటి బౌలర్లను ఎదుర్కొంటూ.. సచిన్ సెంచరీ చేసిన ఇండియా ఓడిపోవడం ఎంత బాధ కలిగిస్తుందో.. సగటు క్రికెట్ అభిమానికి, సచిన్‌కి మాత్రమే తెలుసు. అందుకే.. అంత గొప్ప ప్రదర్శన చేసినా.. అవార్డు వచ్చినా.. అవన్ని మర్చిపోయి.. తన జట్టు ఓడిపోయిందనే బాధలో సచిన్ పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్లలో తన దేశంపై, ఆటపై అతనికెంత ప్రేమ ఉందో, క్రికెట్‌ను సచిన్ ఎంత ప్రేమిస్తాడో, ఓటమిని ఎలా తట్టుకోలేడో తెలుస్తుంది. అందుకే సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి ఇండియన్ క్రికెట్‌కు దేవుడయ్యాడు. ఆటను ప్రాణంగా ప్రేమిస్తే తప్ప.. ఒక టాలెంటెడ్ ఆటగాడు గొప్ప ఆటగాడు కాలేడు. దానికి మనిషిరూపంలో ఉదాహరణ సచిన్ టెండూల్కర్. అలాంటి ఆటగాడు మన దేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం.