సచిన్ టెండూల్కర్ ఎంత గ్రేట్ అనేది మనలో చాలామందికి తెలుసు. ఆయన జ్ఞాపకాలు ఏం గుర్తొచ్చినా సరే ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతూ ఉంటారు. తాజాగా ఆయన బర్త్ డే సందర్భంగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది!
సచిన్ టెండూల్కర్.. ఇదో మాట కాదు ఓ మంత్రం. క్రికెట్ ని మతంగా భావించే కొన్ని కోట్ల మంది భారతీయులకు ఆయన ప్రత్యక్ష దైవం. సచిన్.. సచిన్.. సచిన్.. సచిన్ అంటూ గొంతు పగిలిపోయేలా ఆయన జపం చేయని అభిమాని ఉండడు. 1983లో కపిల్ డెవిల్స్ వరల్డ్ కప్ నెగ్గిన క్షణాన.. ఇండియాలో క్రికెట్ ని సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ.. ఈ దేశంలో ఆ ఆటకి పరుగులు నేర్పిన ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే. ఒక్క సచిన్ కోసమే ఆటలోకి కార్పొరేట్స్ క్యూ కట్టాయి. అక్కడ నుండే క్రికెట్ కి కనకవర్షం ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. సచిన్ ఆటకే కాదు, సచిన్ బ్యాటు కి డబ్బులు, సచిన్ బూటుకి డబ్బులు, సచిన్ నవ్వుకి డబ్బులు, సచిన్ నడిస్తే డబ్బులు, సచిన్ చూస్తే డబ్బులు.. ఒక్కటేంటి ఇలా ఇండియాలో క్రికెట్ వాల్యూని పెంచి, ఈరోజు ఆ ఆటకి లక్షల కోట్ల బిజినెస్ తెచ్చింది ఆ క్రికెట్ దేవుడే. అలాంటి భారతరత్న నేటితో 50ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సచిన్ పుట్టినరోజు అంటే క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఓ పండగే. ఇలాంటి పర్వదినాన సచిన్ సాధించిన ఘనతలు, ఆయన మంచి వ్యక్తిత్వం, ఒదిగి ఉండే తీరు ఇలా అన్నిటిని ప్రస్తావిస్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సహజమే. ఈ మధ్య KGF ఎలివేషన్స్ తో ఫ్యాన్ మేడ్ వీడియోస్ సోషల్ మీడియాలో చాలానే కనిపిస్తున్నాయి. కానీ.. 9 ఏళ్ళ క్రితం సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజున ఓ వీడియో బయటకి వచ్చింది. 9 నిమిషాలకి పైగా నిడివి ఉన్న ఆ వీడియోలో సచిన్ ప్రస్థానం పూర్తిగా చూపించారు. 16 ఏళ్ళ వయసులో పాకిస్థాన్ పై డెబ్యూ ఇవ్వడం, వకార్, వసీం లాంటి ఫాస్ట్ బౌలర్స్ ను సమర్ధంగా ఎదుర్కోవడం, టెస్టుల్లో తొలి సెంచరీ, 70కి పైగా వన్డేల తరువాత చేసిన తొలి సెంచరీ, షార్జాలో ఆసీస్ పై సింహగర్జన, ఓపెనర్ గా పారించిన పరుగుల వరద, వరల్డ్ కప్ కోసం సచిన్ పడ్డ కష్టం.. చివరిలో భావోద్వేగమైన రిటైర్మెంట్ క్షణాలు ఇలా అన్నీ ఆ వీడియోలో ఉన్నాయి.
నిజానికి సచిన్ రిటైర్మెంట్ ఇచ్చేసి 9 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటితరం ఆ క్రికెట్ దేవుడి ఆటని అస్వాదించి చాలా తక్కువే. కానీ ఈతరం స్టార్స్ అయిన కోహ్లీ, ధోనీ, రోహిత్ కంటే ఇప్పటికీ సచిన్ కే ఎక్కువ క్రేజ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. ఇప్పుడు కూడా ఎక్కడో ఓ చోట సచిన్ కనిపించినా, ఈ పేరు వినిపించినా సరే క్రికెట్ ప్రేమికులు అలెర్ట్ అయిపోతారు. ప్రతి ఏడాది జరిగే రోడ్ సేఫ్టీ టోర్నీలో సచిన్ ఆడుతుంటాడు. అందులో సచిన్ బ్యాటింగ్ చూసినా ప్రతిసారీ.. ఎందుకు అంత త్వరగా రిటైర్మెంట్ ఇచ్చేశారు. మరికొన్నాళ్లు ఆడుంటే బాగుండేదని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ అదే జరిగి ఉంటే.. కోహ్లీ, ధోనీ కాదు సచిన్ మాత్రమే టాప్ లో ఉండేవాడు. మీరు అవునన్నా కాదన్నా సరే ఇదే నిజం. సరే ఇదంతా కాదు కానీ దిగ్గజ సచిన్ పేరు చెప్పగానే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? కింద కామెంట్ చేయండి.