టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని టీ20 సిరీస్‌లకు పక్కనపెట్టడాన్ని భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్ తప్పుబట్టారు. విరాట్ కోహ్లీని పక్కనపెట్టి టీ20లు గెలిచే దమ్ము టీమిండియాకు ఉందా? కోహ్లీ లేకుంటే.. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ గెలిచేవాళ్లా? అంటూ సబా కరీమ్ ప్రశ్నించారు. ఆస్ట్రేలియా వేదికగా ఇటివల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్ వరకు వెళ్లింది. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో అవమానకరమైన ఓటమితో ఇంటిబాట పట్టింది. ఈ ఓటమితో టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే.. వరల్డ్ కప్ తర్వాత.. టీమిండియా ఆడే టీ20 సిరీస్‌లకు సీనియర్లయిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని పక్కన పెడుతూ వస్తున్నారు. వరల్డ్ కప్ వెంటనే న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో యంగ్ టీమిండియా ఆడింది. ఆ సిరీస్‌లో విశ్రాంతి పేరుతో కోహ్లీ, రోహిత్‌తో పాటు మరికొంతమందిని పక్కన పెట్టారు.
ఇప్పుడు తాజాగా శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌కు సైతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను పక్కన పెట్టింది బీసీసీఐ. ఈ విషయంపై మాజీ క్రికెటర్ సబా కరీమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టీ20లకు రోహిత్ శర్మను పక్కనపెట్టడాన్ని సమర్ధించిన సబా.. కోహ్లీని పక్కన పెట్టడాన్ని తప్పుబడుతున్నారు. 2022 ఏడాదికి టీ20ల్లో 138.23 స్ట్రైయిక్ రేటు, 55.78 సగటుతో విరాట్ కోహ్లీ 781 పరుగులు చేశాడని.. అత్యధిక టీ20 పరుగులు చేసిన బ్యాటర్లలో మూడో స్థానంలో నిలిచని అలాంటి బ్యాటర్‌ను టీ20లకు ఎలా పక్కన పెడతారని సబా ఆగ్రహం వ్యక్తం చేశారు. సబా కరీమ్ 1997 నుంచి 2000 మధ్య టీమిండియాకు వికెట్ కీపర్‌గా సేవలు అందించారు. ఒక టెస్టు, 34 వన్డేలు ఆడారు.
‘ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022లో విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన కనబర్చాడు. వరల్డ్ కప్‌లో కోహ్లీ ఏకంగా 4 హాఫ్ సెంచరీలో 296 పరుగులు చేసి.. టోర్నీకే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లో 82 పరుగులతో విశ్వరూపం చూపించిన కోహ్లీ.. పాక్ కోరల్లోంచి మ్యాచ్ లాగి.. 8 బంతుల్లో 28 పరుగులు చేసిన దశలో రెండు అద్భుతమైన సిక్సులతో మ్యాచ్ గెలిపించాడు. అలాంటి ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను టీ20లకు పక్కన పెట్టడం సరి కాదు’ అన్నారు. కాగా.. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ కోసం హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా, సూర్యకుమార్ యాదవ్ వైప్ కెప్టెన్‌గా యంగ్ టీ20 టీమ్‌ను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. 2023లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం కోహ్లీ, రోహిత్‌లను వన్డేలు ఎక్కువగా ఆడిస్తున్నారనే వాదన కూడా ఉంది. మరి ఈ విషయంలో సబా కరీమ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#TeamIndia squad for three-match T20I series against Sri Lanka.#INDvSL @mastercardindia pic.twitter.com/iXNqsMkL0Q
— BCCI (@BCCI) December 27, 2022