రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భారత్ లెజెండ్స్ విజయయాత్ర కొనసాగుతోంది. కుర్రాళ్ల ఆటకు ఏమాత్రం తీసిపోకుండా లెజెండ్స్ ఆడుతున్న తీరు అద్బుతం. వీరి ఆట చూస్తుంటే.. అరె.. వీరు రిటైర్ కాకుంటే బాగుండే అనిపిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్ లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్.. ఇంగ్లాండ్ లెజెండ్స్ ను 40 పరుగులతో చిత్తు చేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్ లో సచిన్ తన క్లాస్ ఆటను మరోసారి రుజువుచేస్తూ.. మెరుపు ఇన్నింగ్స్ ను ఆడాడు. ఈ మ్యాచ్ లో సచిన్ బ్యాటింగ్ ను చూడడానికి రెండు కళ్లూ సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. టీమిండియా యువ ఆటగాళ్లకు దీటుగా సచిన్ ఈ సిరీస్ లో రాణిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మెరిసిన మాస్టర్ బ్లాస్టర్..
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా ఇంగ్లాండ్ లెజెండ్స్ వర్సెస్ ఇండియా లెజెండ్స్ మధ్య 14వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగియ్యడంతో మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. మెుదట టాస్ గెలిచిన ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన ఇండియా లెజెండ్స్ దూకుడుగా బ్యాటింగ్ ను ప్రారంభించింది. సచిన్-ఓజా జోడీ ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఎప్పటిలాగే తన క్లాస్ ఆటతో అభిమానులను అలరించాడు. ట్రెమ్లెట్ బౌలింగ్ లో వరుసగా 2 సిక్స్ లు బాదిన సచిన్ తన స్ట్రాటజీని ప్రత్యర్థి బౌలర్లకు తెలియజేశాడు. ఈ రెండు సిక్స్ లు మ్యాచ్ కు హైలెట్ అని చెప్పాలి. మెుదటి సిక్స్ ను ఫైన్ లెగ్ మీదుగా స్టాండ్స్ కు పంపిన సచిన్.. వెంటనే తర్వాతి బాల్ ను కూడా లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్ గా మలిచాడు. ఒకానొక దశలో మాస్టర్ బ్లాస్టర్ స్ట్రైక్ రేట్ 264 ఉందంటేనే అర్ధం చేసుకోవాలి.. సచిన్ ఇన్నింగ్స్ లో ఎంత వేగం ఉందో. ఈ వయసులోనూ యువ ఆటగాడిలా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం చూస్తూంటే.. సచిన్ కు ఇంకా వయసు అయిపోలేదు అనిపిస్తుంది మనకు. సచిన్ తన కళాత్మకమైన షాట్లతో అభిమానులను అలరించాడు.
1998 షార్జా మ్యాచ్ ను గుర్తు చేసిన సచిన్..
ఇక సచిన్ ఈ సిరీస్ లో తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే సచిన్ ట్రెమ్లెట్ బౌలింగ్ లో వరుసగా 6,6,4 బాదాడు. ఇందులో సచిన్ ఒక సిక్స్ ను రెండడుగులు ముందుకు వేసి స్ట్రయిట్ సిక్సర్ గా మలిచాడు. ఈ సిక్స్ అచ్చం 1998లో కోకకోలా కప్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా పై షార్జాలో కొట్టిన సిక్స్ లాగే ఉందంటూ.. రెండు వీడియోలను కలిపి ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అదీ కాక “మాస్టర్ బ్లాస్టర్ సిక్సర్లు చూస్తుంటే మనం ఉన్నది 2022లోనా లేక 1998 లోనా అనే అనుమానం కలుగుతోందని” రాసుకొచ్చాడు. 25 ఏళ్ల క్రితం ఏ షాట్ ఆడాడో ఇప్పుడు కూాడా అదే షాట్ ఆడాడు. దాంతో ఈ షాట్ ను చూసిన క్రికెట్ అభిమానులు క్రికెట్ గాడ్ ఆటలో ఏ మార్పు రాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ షార్జా మ్యాచ్ లో సచిన్ సెంచరీతో చెలరేగాడు. అప్పట్లో ఈ తుపాన్ ఇన్నింగ్స్ ను “డెసర్ట్ స్ట్రోమ్” అని క్రీడాభిమానులు ముద్దుగా పిలుచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో అనేక మంది సోషల్ మీడియా వేదికగా సచిన్ కు ఇంకా వయసై పోలేదు అంటూ రాసుకొచ్చారు.
𝗦𝗵𝗮𝗿𝗷𝗮𝗵 𝟮.𝟬 😍🙌🔟🏏 whattttt a playerrr 💙@sachin_rt turning back the clock 🕰️🔄#RoadSafetyWorldSeries #sachintendulkar #sharjah #GOAT #God pic.twitter.com/DflUaugI4N
— Ashish Verma (@ashu112) September 22, 2022
ఈ క్రమంలోనే సచిన్ కేవలం 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి స్కోఫీల్డ్ బౌలింగ్ లో అవుటైయ్యాడు. ఈ మ్యాచ్ లో సచిన్ స్ట్రైక్ రేట్ 200 ఉండటం విశేషం. తరువాత రైనా (12) త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ చివర్లో యూసఫ్ పఠాన్.. యువరాజ్ సింగ్ లు విధ్వంసం సృష్టించారు. యూసఫ్ పఠాన్ 11 బంతుల్లో ఫోర్, 3 సిక్స్ లతో 27 పరుగులు చేయగా.. చివర్లో యూవీ కేవలం 15 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ తో 31 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో స్టువర్ట్ బిన్నీ(18), ఇర్ఫాన్ పఠాన్(11) పరుగులతో రాణించారు. దాంతో ఇండియా లెజెండ్స్ నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 170 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ప్యారీ 3 వికెట్లు తీయగా.. స్కోఫీల్డ్ 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ లెజండ్స్ 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ లెజెండ్స్ బ్యాటర్లలో మస్టర్డ్ 29 రన్స్, ట్రెమ్లెట్ 24 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో పవార్ 3 వికెట్లు, బిన్నీ, మన్ ప్రీత్ గోనీ తలా ఓ వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన మాస్టర్ బ్లాస్టర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. మరి ఈ వయసులో కూడా కుర్రాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్న సచిన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sachin Tendulkar’s All 3 Sixes in Today’s match 💙#RoadSafetyWorldSeries pic.twitter.com/Y4t1VOjcw7
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) September 22, 2022