ఒక్క మ్యాచ్ ఓటమితో టీమిండియాలో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్లేయర్ల మార్పులతో పాటు ఏకంగా కెప్టెన్సీ విషయంలోనూ ఛేంజ్ జరిగే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓటమితో భారత క్రికెట్ జట్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ఐపీఎల్ కారణమని.. లీగ్‌లో ఆడిన ప్లేయర్లు అలసిపోయారని అంటున్నారు. రెస్ట్ తీసుకోకుండా నేరుగా వచ్చి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడటం భారత అవకాశాలను దెబ్బతీసిందని క్రికెట్ అనలిస్టులు చెబుతున్నారు. అదే సమయంలో కీలక మ్యాచ్‌లో భారత టీమ్ సెలక్షన్ సరిగ్గా లేదని అంటున్నారు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యం పైనా విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన జట్టును ఎంచుకోవడంలోనూ, సారథిగా దూకుడుగా వ్యవహరించడంలోనూ, సరైన టైమ్‌లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ అతడు ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. ఇలా ఒక్క ఓటమితో రోహిత్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ ఓటమి ప్రభావం జట్టుపై గట్టిగానే పడేలా ఉంది.
టెస్ట్ టీమ్‌లో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఛటేశ్వర్ పుజారా లాంటి సీనియర్ ప్లేయర్‌ను పూర్తిగా పక్కనపెట్టే ఛాన్స్ ఉందని అనలిస్టులు అంటున్నారు. అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అవకాశం ఇచ్చినా ఆకట్టుకోని కీపర్ కేఎస్ భరత్‌ను కూడా దూరం పెడతారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరి స్థానంలో త్వరలో జరిగే వెస్డిండీస్ సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్ లాంటి యువ ప్రతిభావంతులకు ఛాన్స్ ఇస్తారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. విండీస్ సిరీస్ టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకు చివరిది కానుందని వార్తలు వస్తున్నాయి. 36 ఏళ్ల హిట్‌మ్యాన్.. ఇక టెస్టు సారథిగా ఎక్కువ కాలం కొనసాగే ఛాన్స్ లేదనే చర్చ సాగుతోంది. రోహిత్ శర్మను వెంటనే కెప్టెన్‌గా తొలగించకపోయినా డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25) ముగిసేంత వరకు అతడే సారథిగా ఉంటాడని చెప్పడం సందేహమే.
ఈ మధ్య బ్యాటింగ్‌లోనూ ఫెయిలవుతున్న హిట్‌మ్యాన్.. విండీస్‌తో సిరీస్‌లో ఎలా ఆడతాడనేది కీలకంగా మారనుంది. దీన్ని బట్టి శివ్‌సుందర్ దాస్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని తెలుస్తోంది. కరీబియన్ సిరీస్ తర్వాత డిసెంబర్ వరకు టెస్టులు లేవు కాబట్టి టీమిండియా కెప్టెన్సీ మార్పుపై చర్చించేందుకు సెలెక్షన్ కమిటీకి కావాల్సినంత టైమ్ దొరుకుతుంది. కొత్త కెప్టెన్‌ను ఎంచుకోవాలంటే అందులో సెలెక్షన్ కమిటీతో పాటు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ కూడా కీలక పాత్ర పోషిస్తారు. నంబర్ వన్ టెస్ట్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలను ఫ్యూచర్ కెప్టెన్లుగా బీసీసీఐ భావిస్తోందని సమాచారం. అయితే వీరికి కూడా 35 ఏళ్లు దాటుతుండటంతో.. శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ లాంటి యంగ్ ప్లేయర్ల వైపు భారత క్రికెట్ బోర్డు చూస్తోందని తెలుస్తోంది.