బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది. గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి చెంది తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది భారత జట్టు. చెత్త బ్యాటింగ్ కు తోడు చెత్త ఫీల్డింగ్ తోడు కావడంతో బంగ్లాదేశ్ కు విజయాన్ని చేజేతులా కట్టబెట్టింది. ఫీల్డర్లు క్యాచ్ లు జారవిడచటంతో పాటుగా ఓవర్ త్రోలతో అనవసరంగా పరుగులు సమర్పించుకున్నారు. దాంతో బంగ్లా విజయం మరింత సులువైంది. ఇక మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన రోహిత్ శర్మ టీమిండియా ఓటమికి కారణలు వెల్లడించాడు. ఈ క్రమంలోనే టీమ్ గురించి మరికొన్ని షాకింగ్ కామెంట్స్ ను సైతం చేశాడు. ప్రస్తుతం రోహిత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
”ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ టీమ్ చాలా అద్భుతంగా ఆడుతోంది. ఆ జట్టు ప్రదర్శనను తక్కువగా అంచనా వేయలేం” బంగ్లాతో సిరీస్ ప్రారంభానికి ముందు మీడియాతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇవి. రోహిత్ అన్నట్లుగానే ఆదివారం జరిగిన మ్యాచ్ లో బంగ్లా అద్భుతమైన పోరాటంతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ విజయంలో బంగ్లా బ్యాటర్ల కంటే భారత్ ఫీల్డర్లదే కీలక పాత్ర అని చెప్పాలి. ఇక టీమిండియా ఓటమి అనంతరం ప్రెస్ మీట్ లో రోహిత్ శర్మ మాట్లాడాడు. టీమిండియా ఆటతీరుపై ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
“ఈ మ్యాచ్ లో బౌలర్లు అద్భుతంగా పోరాడారు. అసలు మేం చేసిన స్కోర్ కు మ్యాచ్ ను అక్కడిదాక తేవడమే గొప్ప విషయం. మ్యాచ్ చివరి వరకు బౌలర్లు వంద శాతం కష్టపడ్డారు. అయితే మేం ఇంకో 25-30 పరుగులు చేస్తే ఫలితం వేరే విధంగా ఉండేది. ఈ మ్యాచ్ లో బ్యాటర్లు అందరు సమష్టిగా విఫలం అయ్యారు” అని రోహిత్ శర్మ ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు. ఇక మా ఇన్నింగ్స్ సాగిన విధానం చూస్తే.. 240 నుంచి 250 రన్స్ సాధిస్తామని అనుకున్నట్లు రోహిత్ తెలిపాడు. అయితే కంటిన్యూస్ గా వికెట్లు కోల్పోవడంతో 186 పరుగులకే పరిమితం అయ్యాం అని రోహిత్ అన్నాడు.
ముఖ్యంగా ఇలాంటి పిచ్ లపై ఎలా ఆడాలో జట్టులోని అందరు ఆటగాళ్లు నేర్చుకోవాలని రోహిత్ సూచించాడు. మా బాయ్స్ ఈ ఓటమి నుంచి చాలా నేర్చుకోవాలి. నెక్ట్స్ మ్యాచ్ కోసం మేం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. బుధవారం జరగబోయే రెండో వన్డేలో మెరుగ్గా రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు రోహిత్. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో కేఎల్ రాహుల్ ఒక్కడే 73 పరుగులతో రాణించాడు. అనంతరం 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది బంగ్లాదేశ్. కెప్టెన్ లిటన్ దాస్ 41 రన్స్ తో రాణించగా.. చివర్లో మెహది హసన్ 38 పరుగులతో అజేయంగా నిలిచి బంగ్లాను గెలిపించాడు.