ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో వీరవిహారం చేశాడు. స్పిన్ ట్రాక్‌పై అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తూ మరో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
టీమిండియా సారథి రోహిత్ శర్మ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. తన బ్యాట్‌కు పదును ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు. తానింకా పరుగుల దాహంతో ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ (100 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. టెస్టుల్లో అతడికిది తొమ్మిదో సెంచరీ కావడం గమనార్హం. చివరగా 2021లో ఇంగ్లండ్‌పై హిట్‌మ్యాన్ సెంచరీ బాదాడు. ఇక, ఇవాళ ఆసీస్‌పై 171 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్న రోహిత్.. మొత్తంగా 14 బౌండరీలు, 2 సిక్సులు బాదడం విశేషం. కేఎల్ రాహుల్ (20), ఛటేశ్వర్ పుజారా (7), విరాట్ కోహ్లీ (12), సూర్య కుమార్ యాదవ్ (8) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరుకున్నా రోహిత్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. సహజశైలికి విరుద్ధంగా ఆడిన హిట్‌మ్యాన్.. మంచి బంతుల్ని గౌరవిస్తూ డిఫెన్స్ ఆడాడు. చెత్త బంతులు వచ్చినప్పుడు మాత్రం బౌండరీకి తరలించాడు.
నాగ్‌పూర్ పిచ్‌పై వస్తున్న విమర్శలకు రోహిత్ తన ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడనే చెప్పాలి. పిచ్ బాగోలేదంటూ వస్తున్న కామెంట్స్‌కు హిట్‌మ్యాన్ జవాబు చెప్పాడు. గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై ఆడాలంటే డిఫెన్సివ్ టెక్నిక్‌తో పాటు ఓపిక అవసరమని తన శతకంతో నిరూపించాడు. మంచి బంతుల్ని ఆపుకుని, చెత్త బంతుల్ని శిక్షిస్తూ ఉపఖండపు పిచ్‌ల్లో ఆడాల్సిన విధానమేంటో చూపించాడు. టాడ్ మర్ఫీ, నాథన్ లయన్ వేసిన పలు బంతులు సరిగ్గా బ్యాట్‌పైకి రానప్పుడు, బంతి బాగా స్పిన్ అవుతున్నప్పుడు.. ఒక్కో పరుగు తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు రోహిత్. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అలాగే బౌలర్ల మీద ఒత్తిడి పెంచడం ద్వారా సిసలైన టెస్ట్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో ఆసీస్ మీడియాతో పాటు విమర్శకులకు రుచి చూపించాడు.
ఇకపోతే, నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజు టీమిండియా అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను 177 రన్స్‌కే ఆలౌట్ చేసింది. గాయం తర్వాత పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఆసీస్ వెన్నువిరిచాడు. మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. పేసర్లు షమి, సిరాజ్ చెరో వికెట్‌తో మంచి సహకారం అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి రోజు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 77 రన్స్ చేసింది. రెండో రోజు ఆటలో ఆసీస్ దూకుడు ప్రదర్శిస్తోంది. భారత బ్యాట్స్‌మెన్‌ను కంగారూ స్పిన్నర్లు బాగా కట్టడి చేశారు. ప్రస్తుతం టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది. మర్ఫీ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఆసీస్ స్కోరుకు భారత్ ఇంకా 1 రన్ దూరంలో ఉంది. ఒంటరి పోరాటం చేస్తున్న రోహిత్ ఎంతసేపు క్రీజులో నిలుస్తాడనే దాని మీదే భారత్ ఆధిక్యం ఆధారపడి ఉంటుంది. మరి.. రోహిత్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.