ఇండోర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సౌతాఫ్రికా పరువు కోసం చివరి మ్యాచ్‌లో జూలువిదిల్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రిలీ రోసోవ్ సెంచరీతో చెలరేగడంతో 227 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బదులుగా టీమిండియా 18.3 ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయి 49 పరుగుల తేడాతో ఓడింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు భారీ షాట్లకు ప్రయత్నించి.. పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో టీమిండియా ఈ సిరీస్ విజయాన్ని 2-1తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కాగా.. ఈ మ్యాచ్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తొలి ఓవర్‌లోనే రబాడా బౌలింగ్‌లో బౌల్డ్ అయిన రోహిత్.. డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో.. టీ20ల్లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్(0 నుంచి 9)కే అవుటైన ప్లేయర్‌గా రోహిత్ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 43 సార్లు టీ20ల్లో 0 నుంచి 9 మధ్య పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ చెత్త రికార్డు ఇంతకు ముందు ఐర్లాండ్ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ పేరిట ఉండేది. అతను 42 ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్ కంటే తక్కువ స్కోర్‌కే అవుట్ అయ్యాడు.
ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించిన రోహిత్ శర్మ.. ఈ చెత్త రికార్డును మూటగట్టుకోవడంపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. కాగా.. రోహిత్ శర్మ, ఒబ్రెయిన్ తర్వాత.. బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్(40), అఫ్ఘనిస్థాన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ(39), పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (37) ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఇక సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగియడంతో రోహిత్ శర్మ తిరిగి ఆస్ట్రేలియాలో త్వరలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్‌తోనే బరిలోకి దిగనున్నాడు. సౌతాఫ్రికా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఉన్నా.. రోహిత్‌తో పాటు మరికొంత మంది ఆటగాళ్లకు వన్డే సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Most times out at single digit score in men’s T20Is:
43 – Rohit Sharma🇮🇳
42 – Kevin O’Brien☘️
40 – Mushfiqur Rahim🇧🇩
39 – Mohammad Nabi 🇦🇫
37 – Shahid Afridi 🇵🇰#INDvSA— Kausthub Gudipati (@kaustats) October 4, 2022
ఇది కూడా చదవండి: బ్యాటింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టిన రోసోవ్! హిట్ వికెట్‌గా అవుట్ కాలేదు.. ఎందుకు?