పైన థంబ్ చూసి మీరు తిట్టుకోవచ్చు! కానీ అదే నిజం. రోహిత్ శర్మ బ్యాటర్ గా సూపర్ హిట్, రికార్డులు సెట్ చేశాడు. మేం కూడా ఒప్పుకుంటాం. కానీ కెప్టెన్ గా మాత్రం డమ్మీగా మిగిలిపోయాడు. వినడానికి నిష్ఠూరంగా ఉన్నా సరే ఇదే నిజం! సాధారణంగా కెప్టెన్ అనే వాడు ఎలా ఉండాలి? జట్టు మొత్తాన్ని మేనేజ్ చేయాలి. ప్రతి ఆటగాడితోనూ టచ్ లో ఉండాలి. ఆడుతున్న మ్యాచులే కాదు, రాబోయే మ్యాచులు ఎలా గెలిచితీరాలి అనే ప్లాన్ తో పక్కా రెడీగా ఉండాలి. కానీ జరగాల్సింది వేరు ఇక్కడ జరుగుతున్నది వేరు. ప్రస్తుతం ఈ విషయం టీమిండియా అభిమానులను, మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియాకు దొరికిన అద్భుతమైన కెప్టెన్లలో విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉంటాడు. ఐసీసీ టోర్నీల్లో కప్ అయితే సాధించలేకపోయాడు గానీ కెప్టెన్ గా ఎన్నో అద్భుతమైన విజయాల్ని నమోదు చేశాడు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లోనూ టీమిండియాను గెలిపించి చూపించాడు. టెస్టుల్లోనూ మన జట్టును నంబర్ వన్ గా నిలిపాడు. కానీ గతేడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా టీమిండియాలో గొడవ షురూ అయింది. వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మని ప్రకటించడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆ ఫార్మాట్ కు కెప్టెన్ గా రోహిత్ ని చేశారు సరే.. ఇప్పుడు ఇలా వన్డేలకు కూడా సారథిగా బాధ్యతలు అప్పగించడంతో కోహ్లీ ఫ్యాన్స్ షాకయ్యారు. ఇక తనని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో కోహ్లీ కూడా ఫీలయ్యాడు. తనని తప్పిస్తున్నట్లు, జట్టు ప్రకటించడానికి 15 నిమిషాల ముందు చెప్పాలని బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి.
సరే అదంతా పక్కనబెడితే వన్డే కెప్టెన్సీ అందుకున్న రోహిత్ శర్మ.. సౌతాఫ్రికా టూర్ కు వెళ్లేముందు గాయపడటం టీమిండియాకు పెద్ద షాక్. దీంతో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్.. టీమిండియాకు టెస్టు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. కోహ్లీ వెన్ను నొప్పితో దూరం కావడంతో భారత జట్టుకు ఓటమే లేని జోహన్స్ బర్గ్ టెస్టుకు రాహుల్ ఏకంగా కెప్టెన్ అయిపోయాడు. ఇక కేప్ టౌన్ లో జరిగిన మూడో టెస్టుతో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీంతో రోహిత్ కు టెస్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇక స్వదేశంలో శ్రీలంకతో టెస్టు సిరీస్ కు కెప్టెన్ గా చేసిన రోహిత్ శర్మ.. విదేశాల్లో ఒక్కటంటే ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయాడు. గత ఏడాది ఆగస్టు కరోనా వల్ల వాయిదాపడ్డ ఇంగ్లాండ్ తో ఐదో టెస్టు.. ఈ ఇయర్ జరగింది. రోహిత్, కేఎల్ రాహుల్ గాయపడటంతో దీనికి బుమ్రా కెప్టెన్సీ చేశాడు. ఆ మ్యాచ్ లో మన జట్టు ఓడిపోయింది.
ఇక ఇంగ్లాండ్ టెస్టు ముగిసిన నాలుగు నెలలకు బంగ్లాదేశ్ పర్యటనకు భారత్ జట్టు వెళ్లింది. వన్డే సిరీస్ లో గాయపడిన రోహిత్, టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్ నే కెప్టెన్సీ ఇచ్చారు. రెండు మ్యాచుల్లోనే టీమిండియాను గెలిపించిన రాహుల్.. మూడు ఫార్మాట్లలోనూ మన జట్టుకు విజయాలు అందించిన మరో కెప్టెన్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఈ ఏడాది ఆడిన ఐదు టెస్టుల్లోనూ భారత జట్టు ముగ్గురు కెప్టెన్లుగా చేశారు. విదేశాల్లో ఆడిన ఒక్క టెస్టుకు కూడా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో క్రికెట్ అభిమానులతో పాటు నెటిజన్స్.. హిట్ మ్యాన్ ని ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీని కాదని రోహిత్ కు బాధ్యతలు అప్పగించారు. రిజల్ట్ మాత్రం ఏం మారలేదని విమర్శిస్తున్నారు. రోహిత్ పేరుకే డమ్మీ కెప్టెన్ అని కామెంట్స్ చేస్తున్నారు. వాటికి ఈ ఏడాది జరిగిన టెస్టులనే ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఉంది. ఇందులో గెలిస్తేనే.. ఇంగ్లాండ్ లో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడతాం. మరి ఈ సిరీస్ కు అయినా సరే రోహిత్ ఉంటాడా? మళ్లీ రాహుల్ కే కెప్టెన్సీ ఇచ్చేస్తారా అని అంటున్నారు. మరీ రోహిత్ డమ్మీ కెప్టెన్ అనే టాక్ పై మీ అభిప్రాయాన్ని దిగువన కామెంట్స్ లో పోస్ట్ చేయండి.