హైదరాబాద్ వేదికగా బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. చివరిదాక ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ లో 12 పరుగుల స్వల్ప తేడాతో భారత జట్టు గెలిచింది. భారీ లక్ష్యం కివీస్ ముందు ఉంచినప్పటికీ.. దాన్ని కాపాడుకోవడానికి బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కివీస్ ఆల్ రౌండర్ బ్రేస్ వెల్ 140 రన్స్ తో ఊహించని రీతిలో చెలరేగడంతో.. ఓ దశలో టీమిండియా ఓటమి ఖాయం అనుకున్నారు. కానీ ఆఖర్లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా పుంజుకుని న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దాంతో టీమిండియా 12 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
న్యూజిలాండ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా స్వల్ప పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు శుభ్ మన్ గిల్(208) అద్వితీయమైన డబుల్ సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 350 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన కివీస్ 49.2 ఓవర్లలో 337 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. అయితే ఒకానొక దశలో 110 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్ ను.. తన అద్భుతమైన బ్యాటింగ్ తో గెలుపు అంచుల దాక తీసుకొచ్చాడు బ్రేస్ వెల్. 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. దాంతో 12 పరుగుల తేడాతో భారత్ గెలిచి ఊపిరి పీల్చుకుంది.
ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ మాట్లాడుతూ..”పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని మాకు తెలుసు. దాంతో మేం బంతితో రాణించకపోతే గెలుపు కష్టమే అవుతుందని ముందే ఊహించాను. ఇదే విషయాన్ని ఆటగాళ్లందరికి తెలిపాను. అదీకాక కివీస్ బ్యాటర్ బ్రేస్ వెల్ అద్భుతంగా రాణించాడు. సాంట్నర్ తో కలిసి జట్టును గెలిపించేటంత పని చేశాడు. వారి బ్యాటింగ్ చూస్తే.. మా ఓటమి ఖాయం అనుకున్నాను. అయితే కీలక దశలో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకుని జట్టుకు విజయాన్ని అందించారు” అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ మ్యాచ్ లో గిల్ అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీ సాధించడం చాలా ఆనందంగా ఉందని రోహిత్ అన్నాడు. అందుకే శ్రీలంక సిరీస్ లో కూడా గిల్ కు మద్ధతుగా నిలిచానని పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు అద్బుత ఫామ్ లో ఉన్నారని ప్రశంసించాడు. ఈ మ్యాచ్ లో సిరాజ్ ఆకట్టుకున్నాడని, గత కొంత కాలంగా అతడు టీ20లు, టెస్టుల్లో బాగా రాణిస్తున్నాడని రోహిత్ కితాబిచ్చాడు. అయితే నేను ఊహించినట్లుగా ఈ మ్యాచ్ లో పరిస్థితులు లేవు అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.