మరికొన్ని రోజుల్లో అసలు సిసలైన క్రికెట్ మజా మొదలవనుంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 9 నుంచి ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్టుతో వరల్డ్ నంబర్ వన్, నంబర్ టూ జట్ల మధ్య టెస్టు సమరం షురూ కానుంది. ఈ టెస్టు సిరీస్‌లో పైచేయి సాధించేందుకు రెండు జట్లు మంచి కసి మీద ఉన్నాయి. ఎలాగై ఆస్ట్రేలియాను ఓడించి.. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలని టీమిండియా.. అలాగే భారత్‌ను ఓడించి 2004 నుంచి ఇక్కడ సిరీస్ గెలవలేదనే అఖ్యాతిని చెరిపివేయాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా తలపడనున్నాయి. చాలా కాలంగా ఈ రెండు దేశాల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత భారత క్రికెట్ అభిమానులు అంతటి ఆసక్తి కనబర్చే మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది భారత్-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్. ఆటతో పాటు ఆటగాళ్ల మధ్య జరిగే కోల్డ్ వార్ కూడా అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది.
ఈ సారి కూడా క్రికెట్ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సిరీస్ సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా, అలాగే ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. అయినా టెస్టు సిరీస్ అంటే ఆ మజానే వేరు. అయితే.. ఆస్ట్రేలియా మాత్రం ప్రతీకారం వాంఛతో రగిలిపోతుంది. వారి దేశంలోనే వారిని ఓడించి.. భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నెగ్గడంపై కంగారులు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు భారత్‌లో భారత్‌ను ఓడించి ట్రోఫీ ఎగరేసుకుపోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే సిరీస్ ఆరంభానికి పది రోజుల ముందే భారత్‌లో వాలిపోయి.. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
అయితే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లను ముఖ్యంగా బౌలర్లను ఓ భారత బ్యాటర్ భయపెడుతున్నాడు. స్వదేశంలో అతని రికార్డులు చూస్తుంటే.. ఆసీస్ బౌలర్లకు చెమటలు పడుతున్నాయి క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా అంటే రెచ్చిపోయి ఆడే విరాట్ కోహ్లీనో, ఈ మధ్య సెంచరీలతోనే మాట్లాడుతున్న శుబ్‌మన్ గిల్ గురించి ఆస్ట్రేలియ పెద్దగా భయపడటం లేదు. కానీ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డులు చూస్తుంటే మాత్రం ఈ సారి ఆస్ట్రేలియాకు దబిడిదిబిడే అన్నట్లు ఉంది. రోహిత్ శర్మ ఇండియాలో ఇప్పటి వరకు 20 టెస్టు మ్యాచ్‌లు ఆడి ఏకంగా 1760 పరుగులు బాదేశాడు. 73.33 సగటుతో బౌలర్లను భయపెడుతున్నాడు. ఈ 20 మ్యాచ్‌ల్లోనే 6 హాఫ్ సెంచరీలు, 7 సెంచరీలు బాదేశాడు. స్వదేశంలో ఈ రికార్డులు చూస్తుంటే.. ఈ సారి ఆస్ట్రేలియా బౌలర్ల భరతం పట్టే ఆటగాడు రోహిత్ శర్మే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. కోహ్లీకి ఆస్ట్రేలియాపై మంచి రికార్డ్ ఉన్నా.. అది ఆస్ట్రేలియాలో. వారిలో దేశంలో వారిని కొట్టాలంటే కోహ్లీ.. ఇండియాలో ఆస్ట్రేలియాను కొట్టాలంటే రోహిత్ శర్మ. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma has a tremendous Test record at home. Will he be the main man for India in the Border-Gavaskar Test series?#RohitSharma #India #Australia #TestCricket #INDvsAUS #CricTracker pic.twitter.com/oFTFQYLfXM
— CricTracker (@Cricketracker) February 3, 2023