ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో ఓడిపోవడం ఏమోగానీ ఓ చెత్త రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ మూటగట్టుకున్నాడు. ఈ విషయంలో కోహ్లీని సమం చేశాడు. ప్రస్తుతం దీని గురించే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
ఒకప్పటితో పోలిస్తే.. టీమిండియా చాలా మెరుగైంది. అద్భుతమైన బ్యాటర్లతోపాటు వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా మన జట్టులోనే ఉన్నారు. అయినా సరే ఇంకా కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ నే తీసుకోండి. తొలి మ్యాచ్ లో రాహుల్ ఆదుకోవడంతో గెలిచేసిన మన జట్టు.. రెండో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో అతి కష్టం మీద 117 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం ఛేదనలో కంగారూ జట్టు.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయం సాధించింది. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచ అత్యుత్తమ జట్లలో టీమిండియా ప్రస్తుతం టాప్ లోనే కొనసాగుతోంది. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్లతో పాటు బౌలర్లు, ఆల్ రౌండర్లు కూడా మన జట్టులోనే ఉన్నారు. అయితే ధోనీ నుంచి కోహ్లీ కెప్టెన్సీ అందుకున్న తర్వాత కావొచ్చు, రోహిత్ శర్మ కెప్టెన్ అయిన తర్వాత ఐసీసీ టోర్నీల్లో తప్పించి మిగతా మ్యాచుల్లో బాగానే ఆడుతోంది. చాలావరకు గెలుస్తూ వస్తోంది. అయితే రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం మాత్రం వరసగా ఇది నాలుగోసారి కావడం అభిమానుల్ని తెగ కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ కోహ్లీ చెత్త రికార్డును ప్రస్తుత కెప్టెన్ రోహిత్ సమం చేశాడు.
ఇలా టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం అనే విషయానికొస్తే.. 2020లో ఆస్ట్రేలియా వన్డేలో సేమ్ సీన్ రిపీటైంది. 2021 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు కూడా భారత్ ని ఇలానే ఓడించింది. ఈ రెండు మ్యాచుల్లో టీమిండియాకు కెప్టెన్సీ చేసింది కోహ్లీ. వీటి తర్వాత అంటే గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీస్ లోనూ మన జట్టు.. ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఏడాది అంటే తాజాగా ఆస్ట్రేలియాతో వన్డేలోనూ ఇలానే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆస్ట్రేలియా, భారత జట్టుపై విజయం సాధించింది. ఈ రెండు మ్యాచులకు రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు. అంటే టీమిండియా ఇలా ఓడిపోవడం వరసగా నాలుగేళ్ల పాటు జరిగింది. గతంలో సునీల్ గావస్కర్, సచిన్, గంగూలీ, ద్రవిడ్ కెప్టెన్సీలోనూ ఒక్కోసారి ఇలానే జరిగింది. ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు మాత్రం భారత్ ఇలా 10 వికెట్ల తేడాతో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. మరి దీనిపై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.