టీమిండియా బౌలర్లపై కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని రీతిలో అసహనం వ్యక్తం చేశాడు. రెండు చేతులు జోడించి మరీ దండం పెడుతూ.. మంచి బౌలింగ్ వేయాలంటూ ప్రాధేయపడ్డాడు. ఈ ఆసక్తికరమైన సంఘటన మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో చోటు చేసుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఉండటంతో భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఐదు గురు బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికా కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే పట్టుదలతో పెద్దగా మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.
ఆ జట్టు కెప్టెన్ బావుమా కేవలం 3 పరుగులే చేసి అవుట్ అయినా.. గత మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన క్వింటన్ డికాక్ అదే ఫామ్‌ను కొనసాగించాడు. అతనికి రిలీ రోస్సోవ్ జతకలిశారు. ఇద్దరూ కలిసి భారత బౌలర్లను పిచ్చికొట్టుడు కొట్టారు. ఈ క్రమంలో డికాక్(68) హాఫ్ సెంచరీ, రోస్సోవ్(100 నాటౌట్) సెంచరీ పూర్తి చేసుకున్నారు. యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్(23), మిల్లర్(19 నాటౌట్) రాణించారు. దీంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా బౌలర్లు ధారళంగా పరుగులు ఇస్తుండడం, ఫీల్డ్ సెట్ తగ్గట్లు కాకుండా వేరే విధంగా బౌలింగ్ చేస్తుండటంపై అసహనానికి గురైన రోహిత్.. రెండు చేతులు జోడించి మరీ మంచి బౌలింగ్ వేయమని బౌలర్లను కోరాడు. రోహిత్ చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ దండం పెడుతున్న ఫొటో వైరల్ అవుతోంది.
కాగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ.. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలిచింది. 228 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగి.. వరుసగా వికెట్లు కోల్పోయింది. దినేష్ కార్తీక్(46), రిషభ్ పంత్(27) భారీ షాట్లతో విరుచుకుపడ్డా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్టే పెద్ద షాట్లకు వెళ్లి వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో 18.3 ఓవర్లలో 178 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది. చివర్లో దీపక్ చాహర్ 31 పరుగులతో కొద్ది సేపు సౌతాఫ్రికా బౌలర్లపై ఎదురుదాటికి దిగాడు. కానీ.. సౌతాఫ్రికా అద్భుతమైన ఫీల్డింగ్‌తో వికెట్లు పడగొట్టడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
Rohit Sharma To Indian Bowlers 🥵#RohitSharma #IndiavsSouthAfrica #rossouw #INDvsSA pic.twitter.com/UVjwOqLBwH
— Tanay (@tanay_chawda1) October 4, 2022
IND Vs SA 3rd T20 Highlights
Last Over Rohit Sharma Reaction 😱#Rohit #TeamIndia pic.twitter.com/1tYfVXLWOL— DY Cricket (@DURGESH93359938) October 4, 2022
ఇది కూడా చదవండి: అవుట్ చేయకుండా ఆట పట్టించిన దీపక్ చాహర్.. వైరలవుతోన్న వీడియో!