కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న వికెట్ కీపర్ కమ్‌బ్యాటర్ కేఎల్ భరత్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఒక విషయంలో కరెక్ట్ చేశాడు. రోహిత్ సైతం అతని మాట విని.. మంచి పని చేశాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైన ఈ టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచామనే ఆనందాన్ని ఆస్ట్రేలియాకు కాసేపు కూడా మిగల్చలేదు భారత పేసర్లు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ తన తొలి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి టీమిండియాకు శుభారంభం అందించాడు. ఆ వెంటనే షమీ వార్నర్‌ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపు స్టీవ్ స్మిత్, లబుషేన్ జోడీ భారత బౌలర్లను ఎదుర్కొంటూ.. నిదానంగా పార్ట్నర్ షిప్ నిర్మించే ప్రయత్నం చేశారు. మూడో వికెట్‌కు ఇద్దరూ కలిసి 82 పరుగులు జోడించిన తర్వాత.. జడేజా బౌలింగ్‌లో డెబ్యూ వికెట్ కీపర్ కేఎస్ భరత్ అద్భుత స్టంపింగ్‌తో లబుషేన్ అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 84 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది.
ఆ వెంటవెంటనే జడేజా మరో రెండు వికెట్లు పడగొట్టడంతో.. ఆసీస్ 109 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో టీమిండియా బౌలర్లు వేస్తున్న ప్రతి బాల్‌పై వికెట్ వస్తున్నట్లు కనిపించింది. ముఖ్యంగా జడేజా బౌలింగ్‌లో ఆడేందుకు ఆసీస్ బ్యాటర్లు వణికిపోయారు. అయితే.. జడేజా బౌలింగ్‌లో చాలా సార్లు బ్యాటర్లు వికెట్ల ముందు ప్యాడ్డు అడ్డు పెట్టడంతో టీమిండియా ఆటగాళ్లు వికెట్ కోసం పదే పదే అప్పీల్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఆసీస్ బ్యాటర్ హ్యాండ్స్‌కాంబ్ వికెట్ కోసం చాలా కాన్ఫిడెంట్‌గా అప్పీల్ చేశాడు. కానీ.. తన కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ వికెట్ కీపర్ కేఎస్ భరత్ మాత్రం.. అవుట్ కాదేమో అని సందేహం వ్యక్తం చేశాడు.
భరత్ అభిప్రాయానికి విలువ ఇచ్చిన రోహిత్ శర్మ.. రివ్యూకు వెళ్లలేదు. నిజానికి రివ్యూకు వెళ్లి ఉంటే భారత్ ఓ రివ్యూను నష్టపోయి ఉండేది. రిప్లేలో అది అవుట్ కాదని తేలింది. దీంతో.. కేఎల్ భరత్ అంచనా నిజమైంది. వెంటనే రోహిత్ భరత్‌ను అభినందించాడు కూడా. అయితే.. తొలి టెస్టు ఆడుతున్న కేఎస్ భరత్ ఇంత నమ్మకంగా కెప్టెన్ రోహిత్ శర్మనే నిర్ణయం మార్చుకునేలా ఒప్పించాడంటే.. భరత్‌కు ధైర్యం ఎక్కువనే చెప్పాలని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అలాగే.. జడేజా బౌలింగ్‌లో లబుషేన్‌ను సూపర్ స్టంపింగ్‌తో భరత్ పెవిలియన్ చేర్చాడు. భరత్ చేసిన ఆ స్టంపింగ్ చూస్తే.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని గుర్తుకు వచ్చాడంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Great work behind the stumps by KS Bharat. pic.twitter.com/P528jX2QqM
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2023