ఆసియా కప్ 2022లో భారత పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించే స్థాయికి చేరింది. టీమిండియా సూపర్ -4 లో భాగంగా దాయాది పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన సంగతి మనందరికి తెలిసిందే. దాంతో టోర్నీలో ముందుకు వెళ్లే పరిస్థితిని సంక్లిష్టంగా చేసుకుంది. ఇక తర్వాత రెండు మ్యాచ్ ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా భారత్ ఓటమి చవిచూసింది. దీంతో ఆసియా కప్ లో భారత్ కథ దాదాపుగా ముగిసినట్లే. అయితే ఏదో అద్బుతం జరిగితే తప్ప టీమిండియా ఆసియా కప్ లో ముందుకు వెళ్లలేదు. ఇక ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన పవర్ చూపించాడు. ఈ క్రమంలోనే రోహిత్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆసియా కప్ లో భాగంగా మంగళవారం శ్రీలంక-భారత్ జట్లు తలపడ్డాయి. మెుదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 72 రన్స్ తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక ఓపెనర్లు కుశాల్ మెండిస్ 57 పరుగులు, నిశాంక 52 రన్స్ తో అద్భుత శుభారంభాన్ని ఇవ్వడంతో లంక సులువుగా గెలిచింది. భారత బౌలర్లలో చాహల్ 34/3 వికెట్లతో రాణించాడు.
తాజాగా ఈ మ్యాచ్ లో 72 పరుగులు చేసిన రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరపున ఆసియా కప్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఇప్పటి వరకు ఈ రికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ పేరు మీద నమోదైంది. సచిన్ భారత తరపున ఆసియా కప్ లో 971 రన్స్ చేశాడు. తాజాగా రోహిత్ 72 పరుగులు చేయడంతో భారత్ తరపున 1016 రన్స్ తో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే మెుత్తంగా ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో శ్రీలంక దిగ్గజ బ్యాట్స్ మెన్ సనత్ జయసూర్య 1220 రన్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక రెండో ప్లేస్ లో లంకకే చెందిన కుమార సంగక్కర 1075 పరుగులతో ఉన్నాడు. రోహిత్ 1016 రన్స్ తో మూడో ప్లేస్ కి వచ్చాడు. ఇదీలా ఉండగా రోహిత్ ఈ క్రమంలోనే మరో రికార్డును కూడా తన ఖాతాలో జమ చేసుకున్నాడు. అదేంటంటే? ఆసియా కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నెం.1 స్థానానికి చేరుకున్నాడు. తాజాగా బాదిన 4 సిక్సర్లతో గతంలో అఫ్రిది పేరు మీద ఉన్న 40 సిక్సర్ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. మరి ఒక్క మ్యాచ్ తోనే రెండు రికార్డులు బ్రేక్ చేసిన హిట్ మ్యాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.