కొన్ని ఏళ్ల పాటు టీమిండియాను నడిపించిన ధోని, కోహ్లీకి సాధ్యంకానిది.. టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కొన్ని రోజుల్లోనే రోహిత్ శర్మ సాధించాడు. కెప్టెన్‌గా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకోవడమే కాకుండా.. వ్యక్తిగతంగా ఓ అరుదైన రికార్డును సైతం నెలకొల్పి.. చరిత్ర సృష్టించాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సులు బాదిన రోహిత్ శర్మ 120 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో రోజు టీ బ్రేక్ తర్వాత చివరి సెషన్ మొదలైన కొద్ది సేపటికే రోహిత్.. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం అవుతున్నా.. రోహిత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ రాహుల్ 20, అశ్విన్ 23, పుజారా 7, విరాట్ కోహ్లీ 12, సూర్య 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినా.. రోహిత్ ఒక్కడు మాత్రం బాధ్యతాయుతంగా ఆడుతూ.. సెంచరీ పూర్తి చేసి, టీమిండియాకు మంచి స్కోర్ అందించే ప్రయత్నం చేశాడు.
కానీ.. అప్పటికే రోజంతా బ్యాటింగ్ చేసి అలిసిపోయిన రోహిత్.. టీ బ్రేక్ తర్వాత అవుట్ అయ్యాడు. కానీ.. ఈ మ్యాచ్‌తో రోహిత్ ఒ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ(టెస్ట్, వన్డే, టీ20) సెంచరీలు సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి రోహిత్ శర్మ.. జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆస్ట్రేలియాపై సెంచరీ పూర్తి చేయడంతో రోహిత్ ఈ ఘనత సాధించాడు. అయితే.. గతంలో టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్లుగా ఉన్న మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ సైతం ఇలాంటి రికార్డును సాధించలేకపోయారు.
అయితే.. ప్రస్తుతం టీమిండియా 69 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 93 బంతుల్లో 42 పరుగులతో పాటు, అక్షర్ పటేల్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో ఆట ముగియడానికి ఇంకా 29 ఓవర్లు ఉన్నాయి. మరి టీమిండియా రెండో రోజే ఆలౌట్ అవుతుందా? లేక ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజుకు వెళ్తుందా అనేది చూడాలి. అయితే.. ఆస్ట్రేలియా డెబ్యూ బౌలర్ టాడ్ మర్ఫీ 5 వికెట్లతో రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్రదర్శనతో పాటు అతను సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Milestone Unlocked 🔓
A special landmark 👏 🙌@ImRo45 becomes the first Indian to score hundreds across Tests, ODIs & T20Is as #TeamIndia captain 🔝 pic.twitter.com/YLrcYKcTVR
— BCCI (@BCCI) February 10, 2023