ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వైఫల్యం తర్వాత.. బీసీసీఐ ప్రక్షాళనకు సిద్ధమైంది. ఇప్పటికే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక‌్షన్ కమిటీని తొలగించిన బీసీసీఐ.. ఇక జట్టులో మార్పులకు పూనుకుంది. ప్రస్తుతం శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ క్రికెటర్లు న్యూజిలాండ్‌తో బుధవారం ఆఖరి వన్డే ఆడేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు, బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లేందుకు రోహిత్ శర్మ కెప్టెన్సీలోని జట్టు సిద్ధమవుతోంది. కాగా.. ఈ టూర్‌కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలతో బీసీసీఐ పెద్దలు సమావేశం కానున్నట్లు సమాచారం. అయితే.. ఈ సమావేశానికి ముందు మరో సంచలన విషయం బయటికి వచ్చింది.
కెప్టెన్ రోహిత్ వర్మతో పాటు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలను ఇకపై టీ20 మ్యాచ్‌లకు ఎంపిక చేయకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకాయన మీడియాకు వెల్లడించినట్లు జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2024 వరకు ఒక కొత్త టీమిండియాను తయారుచేసే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లను వన్డేలు, టెస్టులకు పరిమితం చేసి.. టీ20లకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసి.. న్యూబ్రాండ్ టీమిండియాను ఏర్పాటు చేయాలని వారు భావిస్తున్నారు. కేవలం యువ క్రికెటర్లతో కూడిన జట్టునే టీ20ల్లో ఆడించాలని బోర్డు సభ్యులు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
అయితే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో చర్చించిన తర్వాత.. వారికి ఈ విషయం గురించి వివరించి ముందుకు వెళ్లాలని, అందుకే బంగ్లాదేశ్ పర్యటనకు ముందు వారితో సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. రోహిత్ శర్మ విషయంలో బోర్డు పెద్దలు ఆలోచిస్తున్న దానికి క్రికెట్ అభిమానులు పెద్దగా స్పందించడంలేదు కానీ.. విరాట్ కోహ్లీ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని మాత్రం క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. జట్టులో విరాట్ కోహ్లీ సీనియర్ క్రికెటరే అయినా.. అందరి కంటే అతనే ఫిట్‌గా ఉంటాడని, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గాయంతో ఎన్‌సీఏ గడపతొక్కని ఒకే ఒక ఇండియన్ క్రికెటర్ కోహ్లీ అని అలాంటి ఆటగాడిని వయసు చూపిస్తూ.. పక్కన పెట్టడం అర్థం రహితమని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇటివల టీ20 వరల్డ్ కప్‌లో అందరి కంటే ఎక్కువ పరుగులు చేసి.. టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచింది కోహ్లీనే అనే విషయం మర్చిపోయారా? అంటూ విమర్శిస్తున్నారు. టీ20లకు కెప్టెన్‌గా అనుకుంటున్న హార్దిక్ పాండ్యా సైతం ఎప్పుడు గాయాలపాలవుతాడో చెప్పలేరని, కోహ్లీ విషయంలో అలాంటి బెంగ అవసరం లేదని, పాండ్యా కంటే కూడా కోహ్లీనే చాలా ఫిట్ ఉంటాడని, కోహ్లీతో సమానంగా వికెట్ల మధ్య సింగిల్స్ కోసం పరిగెత్తే క్రికెటర్ ప్రస్తుత టీమిండియాలో ఎవరూ లేరని క్రికెట్ అభిమానులు అంటున్నారు. బ్యాటింగ్‌లో కోహ్లీ ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ చెబుతుందని.. అలాంటి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ గెలిపించగల ఒక్క క్రికెటరైనా టీమిండియాలో ఉన్నాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ కొట్ట గలిగే యువ క్రికెటర్లు సైతం టీమిండియాలో లేరని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి ఆటగాడిని టీ20లకు పక్కన పెడతామని అనడం అర్థంలేని విషయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
High level meeting of BCCI will be held in Mumbai tomorrow Captain Rohit Sharma, Vice Captain Lokesh Rahul, Former Captain Virat Kohli, Coach Rahul Dravid will be present in that meeting, discussion on future of T20, Test captaincy can be discussed with Virat ( Inside Report )
— Sanjay kumar (@Sanja_yk47) November 29, 2022