టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్.. కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. న్యూఇయర్ వేడుకల కోసం ఇంటికి వెళ్తుండగా.. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు పంత్ ప్రయాణిస్తున్న కారు.. డివైడర్‌ను ఢీకొట్టడంతో.. ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పంత్ కారు పూర్తిగా కాలిపోయింది. పంత్‌కు యాక్సిడెంట్ జరిగిన సమయంలో.. ఆ దిశగా వస్తోన్న బస్సు డ్రైవర్ వెంటనే స్పందించి.. పంత్‌ను కారు నుంచి బయటకు తీయడంతో.. పంత్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ డెహ్రడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో పంత్ వీపు కాలడమేకాక.. తల, మోకాలుకి గాయాలు అయ్యాయి.
ప్రమాదం నేపథ్యంలో.. వైద్యులు పంత్ శరీరంలోని కీలక భాగాలైన మెదడు, వెన్నెముకకు గాయాలయ్యామో తెలుసుకోవడం కోసం ఎమ్మారై స్కాన్ తీశారు. ఈ టెస్టు రిపోర్ట్ నార్మల్ అని రావడంతో.. అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక పంత్ ముఖంపై, శరీరంలోని ఇతర భాగాల్లో కాలిన గాయాలు కావడంతో.. వైద్యులు అతడికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. ఇక పంత్ మోకాలు, కాలి మడమ భాగాల్లోనూ ఎమ్మారై స్కానింగ్ తీయాల్సి ఉండగా.. వాపు, నొప్పి ఉండటంతో రేపటికి వాయిదా వేశారు. కుడి మోకాలి లిగమెంట్‌కు దెబ్బ తగిలి ఉంటుంది అనే అనుమానంతో వైద్యులు.. పంత్ మోకాలి భాగం నుంచి కింది వరకు కదలకుండా కట్టు (స్ప్లింటేజ్) వేశారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతడు స్పృహలోనే ఉన్నాడని మ్యాక్స్ హాస్పిటల్ వర్గాలు శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేసిన మెడికల్ బులెటిన్‌లో వెల్లడించారు.
శుక్రవారం జరిగిన ప్రమాదంలో.. పంత్ మోకాలు, కాలి మడమ భాగంలో తగిలిన గాయాలు తీవ్రంగా లేకపోతే.. అతడు త్వరలోనే కోలుకునే అవకాశం ఉంది. ఒకవేళ గాయాల ప్రభావం తీవ్రంగా ఉంటే.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు పంత్ దూరం అవుతాడు. ఇక టెస్టుల్లో కీలక ఆటగాడైన పంత్ ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమైతే.. అది భారత్‌కు కచ్చితంగా పెద్ద దెబ్బే అంటున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న పంత్.. అంతకు ముందు జరిగిన వన్డేలు, టీ20ల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో పంత్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు రావడంతో.. బంగ్లాతో వన్డే సిరీస్ నుంచి అతడు తప్పుకున్నాడు. అంతేకాక త్వరలో శ్రీలంకతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌కు కూడా పంత్‌ను ఎంపిక చేయలేదు. ఇక పంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.