భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఎవరు గెలుస్తారనే దానిపై సీనియర్ క్రికెటర్లు తలో కామెంట్ చేస్తున్నారు. ఫలానా జట్టే విజేతగా నిలవబోతోందంటూ జోస్యం చెబుతున్నారు. తాజాగా దీనిపై రికీ పాంటింగ్ స్పందించాడు.
సంప్రదాయ టెస్ట్ క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ తగ్గుతోంది. టీ20 ఫార్మాట్ సూపర్ సక్సెస్ కావడంతో టెస్టులు, వన్డేలకు కష్టాలు మొదలయ్యాయి. గంటల కొద్దీ సాగే వన్డేలు, రోజుల కొద్దీ జరిగే టెస్టు మ్యాచ్‌లు చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండటం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో అంత టైమ్ కూడా ఎవరికీ ఉండటం లేదు. అయితే టెస్ట్ క్రికెట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలని ఐసీసీ భావిస్తోంది. ఐదు రోజుల పాటు సాగే మ్యాచ్‌ల్లో సెషన్ సెషన్‌కు మారే ఆధిక్యాలు.. అసలైన టెస్టు మజాను ప్రేక్షకులు ఆస్వాదించాలని ఐసీసీ అనుకుంటోంది. అందుకే ఆ ఫార్మాట్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా నిర్వహిస్తోంది. జూన్ 7వ తేదీన టీమిండియా, ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ఈ మెగా ఫైనల్లో ఎవరు గెలుస్తారనే దానిపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై ఆస్ట్రేలియా మాజీ సారథి, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. టీమిండియా కంటే ఆసీస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పాడు. లండన్‌లోని ఓవల్ స్టేడియంలోని పరిస్థితులు ఆస్ట్రేలియాలో మాదిరిగానే ఉంటాయన్న పాంటింగ్.. కంగారూ జట్టు టైటిల్ నెగ్గే ఛాన్సులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నాడు. అదే ఒకవేళ భారత్‌లో ఈ మ్యాచ్ జరిగితే కచ్చితంగా టీమిండియానే విజయం సాధించేదన్నాడు. ఏదేమైనా ఇరు జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశాడు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పటితో పోలిస్తే భారత జట్టు విదేశీ గడ్డపై ఇప్పుడు అద్భుతంగా ఆడుతోందని పాంటింగ్ మెచ్చుకున్నాడు. టీమిండియా బ్యాటర్ల స్కిల్స్ మెరుగయ్యాయని.. గత దశాబ్ద కాలం నుంచి భారత క్రికెట్ మెరికల్లాంటి ఫాస్ట్ బౌలర్లను అందిస్తూ వస్తోందన్నాడు.