మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ 2022 సంగ్రామం మొదలుకానుంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి గ్రూప్ స్టేజ్ పోటీలు 22 నుంచి అసలు సిసలైన సూపర్ 12 పోటీలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియాతో పాటు పలు దేశాల క్రికెట్ బోర్డులు టీ20 వరల్డ్ కప్ కోసం స్క్వౌడ్‌ను ప్రకటించాయి. అలాగే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా బుధవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టీ20 క్రికెట్‌కు పెట్టింది పేరైన విండీస్ టీమ్.. ఈ సారి మాత్రం అంత బలంగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్‌లో అదరగొట్టే ఆటగాళ్లు.. ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్ లాంటి స్టార్లు లేకుండానే విండీస్ బోర్డు జట్టును ప్రకటించింది. పైగా.. జట్టులో ఇద్దరూ అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు కూడా చోటు ఇచ్చింది. దీంతో రస్సెల్, నరైన్ జట్టులో ఎందుకు లేరనే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో డబ్బు పిచ్చితోనే రస్సెల్, నరైన్ జాతీయ జట్టుకు ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచ వ్యాప్తంగా ఏ టీ20 లీగ్ జరిగినా.. ఫ్రాంచైజ్‌లు ఆసక్తి చూపించేది కరేబియన్ ఆటగాళ్లపైనే. టీ20 క్రికెట్‌లో వాళ్లు అద్భుతంగా ఆడతారు. అందుకే వారిపై కోట్లు కురిపించి ఫ్రాంచైజ్‌లు వారిని దక్కించుకుంటాయి. క్రిస్ గేల్, పోలార్డ్, బ్రావో, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, నికోసల్ పూరన్, జెసన్ హోల్డర్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. ఐపీఎల్‌లో పోలార్డ్ ముంబై ఇండియన్స్‌కు ఆస్థాన క్రికెటర్. అలాగే రస్సెల్, నరైన్ కోల్‌కత్తా నైట్ రైడర్స్‌లో పర్మినెంట్ ప్లేయర్లు. ఇలా ప్రపంచంలో ఏ మూలన టీ20 లీగ్ జరిగినా.. కరేబియన్ ఆటగాళ్లు లేకుండా ఒక్క టీమ్ కూడా దాదాపు ఉండదు. ఆ విధంగా టీ20 క్రికెట్‌పై తమ ముద్ర వేసిన విండీస్ ఆటగాళ్లు.. సొంతం దేశానికి ఆడేందుకు మాత్రం అంతగా ఆసక్తి చూపించరనే విమర్శలు ఉన్నాయి. కొన్ని సార్లు వెస్టిండీస్ ఆడుతున్న మ్యాచ్‌లను సైతం వదిలేసి ఫ్రాంచైజ్‌లకు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
వెస్టిండీస్ స్టార్ ఆటగాళ్లంతా టీమ్‌లో ఉంటే ఆ జట్టును టీ20 ఫార్మాట్‌లో కొట్టడం అంత ఈజీ కాదు. 11కు 11 మంది మ్యాచ్ విన్నర్లే ఉంటారు. కానీ.. అందరూ జట్టులో ఉండరు. అందుకే వెస్టిండీస్ ఆటగాళ్లు స్టార్లే కానీ.. వెస్టిండీస్ టీమ్ మాత్రం వీక్. ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతూ రెస్ట్ లేకుండా క్రికెట్ ఆడే రస్సెల్, నరైన్ లాంటి వాళ్లు దేశం కోసం టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో ఎందుకు ఆడరంటే.. ఇద్దరికీ వేరువేరు కారణాలు ఉన్నాయి. రస్సెల్‌కు వెస్టిండీస్ టీమ్‌తో విభేదాలు ఉన్నా.. అవి కొంత సర్దుమణిగాయి. కానీ.. అతను ఫామ్‌లో లేడనే కారణంతో వెస్టిండీస్ కోచ్ రస్సెల్‌ను పక్కనపెట్టారు. అలాగే విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్.. సునీల్ నరైన్‌ను టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకోవాలని ప్రయత్నించినా.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డులో తనకున్న విభేదాలతో నరైన్ వరల్డ్ కప్ ఆడేందుకు ఆసక్తి చూపించలేదని సమాచారం.
గతమెంతో ఘనంగా ఉన్న వెస్టిండీస్ క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఆర్థిక సమస్యలు వేధించాయి. ఎంతలా అంటే జట్టులోని ఆటగాళ్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. బోర్డుపై టీమ్ మొత్తం కలిసి ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆటనే నమ్ముకున్న ఆటగాళ్లకు.. ఫ్రాంచైజ్ క్రికెట్ వరంలా కనిపించింది. పైగా లీగ్స్‌లో ఆడితే డబ్బుకు డబ్బు, పేరుకుపేరు వస్తుండడంతో.. ఒక్కరొక్కరిగా అందరూ లీగ్స్ బాటపట్టారు. దీంతో వెస్టిండీస్ టీమ్‌లో ఆడేందుకు ఆటగాళ్లు కరువయ్యారు. పైగా ఆటగాళ్లకు, బోర్డుకు మధ్య విభేదాలు కూడా కొంత మందిని జాతీయ జట్టుకు దూరం చేస్తుంది. ఏది ఏమైనా.. జాతీయ జట్టు కంటే ఈ లీగ్ ఎక్కువ కాదు. ఈ విషయం వెస్టిండీస్ ఆటగాళ్లకు అర్థం అయితే టీ20 ఫార్మాట్‌లో వెస్టిండీస్ టీమ్‌కు తిరుగుండదని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఊతప్ప నిస్వార్థమే ‘రోహిత్ 264’ ఇన్నింగ్స్‌కు కారణం!
ICYMI: CWI has announced the 15-man squad for the Men’s T20 World Cup 2022 in Australia! #MenInMaroon #T20WorldCup
More details⬇️ https://t.co/t6ils9Xdox pic.twitter.com/GKxgCHZcvG
— Windies Cricket (@windiescricket) September 14, 2022